Sorakaya Pachi Mirchi Pachadi : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సొరకాయలతో కూరలతో పాటు మనం పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. సొరకాయతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఎవరైనా తేలికగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. రుచిగా, కమ్మగా ఉండే సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, లేత సొరకాయ ముక్కలు – 400 గ్రా., పచ్చిమిర్చి – 15 లేదా తగినన్ని, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక కట్ట, చింతపండు – ఒక టేబుల్ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
సొరకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. వీటిపై మూతను ఉంచి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఇందులో టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వీటిపై మూతను ఉంచి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో కొత్తిమీర, చింతపండు వేసి కలపాలి. కొత్తిమీర మెత్తబడిన తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత వీటిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, ఇడ్లీ, దోశ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.