Sorakaya Ulli Karam : వంటింట్లో ఉపయోగించే కూరగాయల్లో సొరకాయ ఒకటి. కానీ కొందరు సొరకాయను తినడానికి ఇష్టపడరు. సొరకాయను ఆహారంలో భాగవంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఒత్తిడిని తగ్గించడంలో సొరకాయ ఎంతో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిద్రలేమి సమస్యను సొరకాయ దూరం చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా సొరకాయ దోహదపడుతుంది. మన శరీరానికి కావల్సిన విటమిన్స్ అన్నీ సొరకాయలో ఉంటాయి.

వేసవి కాలంలో సొరకాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. సొరకాయతో వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. సొరకాయతో ఉల్లికారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయతో చేసే ఉల్లి కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఇష్టంగా తింటారు. సొరకాయతో ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొర కాయ ఉల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయ ముక్కలు (సన్నగా తరిగినవి) – 2 కప్పులు, ఎండు మిర్చి – 15, ధనియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, సొరకాయ ముక్కలు – 4 కప్పులు, బెల్లం తురుము – 2 టీ స్పూన్స్, చింత పండు – 20 గ్రా., మినపప్పు – 2 టీ స్పూన్స్, శనగ పప్పు – 4 టీ స్పూన్స్, నూనె – అర కప్పు, తరిగిన కొత్తిమీర – అర కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు.
సొరకాయ ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సొరకాయ ముక్కలను తీసుకుని అందులో ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసి పప్పులన్నీ వేసి వేయించి తీయాలి. అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించి తీయాలి. తరువాత ఎండు మిర్చి కూడా వేసి వేయించి తీయాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన పప్పులు, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం తురుము, చింతపండు, ఎండు మిర్చి వేసి మరీ మెత్తగా కాకుండా పట్టి పక్కన ఉంచాలి.
కళాయిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉప్పు, పసుపు కలిపి ఉంచిన సొరకాయ ముక్కల నుండి నీళ్లను పిండేసి వేసి.. మూత పెట్టి చిన్న మంటపై మగ్గనివ్వాలి. ముక్కలు ఉడికిన తరువాత మిక్సీ పట్టి పక్కన ఉంచిన ఉల్లికారాన్ని వేసి కాసేపు వేయించుకోవాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై ఉడికించి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ ఉల్లి కారం తయారవుతుంది. సొరకాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది. మూత్రాశయ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా సొరకాయ ఉపయోగపడుతుంది. ఇలా సొరకాయ ఉల్లికారం తయారు చేసుకుని తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి.