Spicy Mutton Curry : ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో మటన్ ఒకటి. మాంసాహార ప్రియులు ఈ మటన్ ను చాలా ఇష్టంగా తింటారు. శరీర సౌష్టవం కోసం వ్యాయామాలు చేసే వారు మటన్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మటన్ కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే దీనిని అనేక రకాలుగా వండుతూ ఉంటారు. అమ్మమ్మల కాలంలో చేసే విధంగా తక్కువ మసాలాలు ఉపయోగించి రుచిగా ఈ మటన్ కూరను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అర కిలో, నీళ్లు – ఒక లీటర్, పచ్చి కొబ్బరి ముక్కలు – ముప్పావు కప్పు, నానబెట్టిన జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన గసగసాలు – 2 టేబుల్ స్పూన్స్, పెద్ద ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 5, నూనె – అర కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, పెద్ద టమాటాలు – 2, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – అర కట్ట, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
మటన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా మటన్ ను ఉప్పు నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత ఈ మటన్ ను ఒక కుక్కర్ లోకి తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, గసగసాలు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మరో జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా ఫ్యూరీగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా అయిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కలుపుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత మటన్ ను ఉడికించిన నీటిని పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి పొంగు వచ్చే వరకు బాగా ఉడికించాలి. తరువాత ఉడికించిన మటన్ ను వేసి కలపాలి. దీనిపై మూతను ఉంచి కూర దగ్గర పడే వరకు 20 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత దీనిలో గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. చివరగా నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, దోశ, సంగటి, గారెలు ఇలా వేటితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన మటన్ కర్రీని అందరూ లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. ఇలా మటన్ కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.