Stuffed Brinjal Masala Curry : వంకాయలతో మనం రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటితో కూరలు తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో గుత్తి వంకాయలు కూడా ఒకటి. గుత్తి వంకాయలు తెలియని వారుండరు. వీటితో చేసే కూరలను అందరూ లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. ఈ గుత్తి వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కూరలను కూడా తయారు చేసుకోవచ్చు. గుత్తి వంకాయలతో చేసే మసాలా కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఈ గుత్తి వంకాయలతో రుచిగా, భిన్నంగా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావు కిలో, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 7, పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టేబుల్ స్పూన్, ధనియాల పొడి – అర టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా వంకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి. తరువాత జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, నువ్వులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముందుగా కట్ చేసుకున్న వంకాయలల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న వంకాయలను వేసి వేయించాలి. ఈ వంకాయలనై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని మరో వైపుకు తిప్పుకుని మరో 5 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత మిగిలిన మసాలా మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని 4 నుండి 5 నిమిషాల పాటు వేయించిన తరువాత 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో, బగారా అన్నం, జీరా రైస్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ గుత్తి వంకాయ మసాలా కూరను లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.