Stuffed Paratha : మనం గోధుమపిండితో రకరకాల పరాటాలను తయారు చేస్తూ ఉంటాము.గోధుమపిండితో చేసే పరోటాలను తీసుకోవడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. గోధుమపిండితో మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరోటాలలో స్టఫ్డ్ పరోటా కూడా ఒకటి. బంగాళాదుంపలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ పరోటాలను తయారు చేయడం కూడా చాలా సులభం. తరచూ ఒకేరకం పరాటాలు కాకుండా ఇలా అప్పుడప్పుడూ మరింత రుచిగా స్టఫ్డ్ పరాటాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. రుచిగా స్టఫ్డ్ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టఫ్డ్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టీ స్పూన్స్, గోరు వెచ్చని నీళ్లు – తగినన్ని.
స్టఫింగ్ కు కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 3, ఉడికించిన బంగాళాదుంపలు – 2, ఉప్పు – తగినంత, చాట్ మసాలా -ఒక టీ స్పూన్, మిరియాల పొడి -ఒక టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి -ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
స్టఫ్డ్ పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కోడిగుడ్లను అలాగే బంగాళాదుంపలను తురుముకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత గోధుమపిండిని తీసుకుని ముందుగా పూరీ పరిమాణంలో వత్తుకోవాలి. తరువాత దీని మధ్యలో స్టఫింగ్ ను ఉంచి అంచులను మూసి వేయాలి.
తరువాత పొడి పిండి చల్లుకుంటూ పరోటాలా మందంగా చేసుకోవాలి. తరువాత ఈ పరోటాను వేడి వేడి పెనంపై వేసి కాల్చుకోవాలి. దీనిని నూనె లేదా నెయ్యి వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ పరోటా తయారవుతుంది. ఈ పరోటాలను నేరుగా తినవచ్చు లేదా రైతాతో తినవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పరోటాలు చాలా చక్కగా ఉంటాయి.