Vellulli Nuvvula Karam : నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా చేయడంలో, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా నువ్వులు మనకు సహాయపడతాయి. వంటల్లలో వాడడంతో పాటు నువ్వులతో మనం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు కలిపి చేసే కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అన్నంతో పాటు టిఫిన్స్ తో కూడా ఈ కారం పొడిని తీసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లి నువ్వుల కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి నువ్వుల కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు -ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు – అర కప్పు, ఉప్పు – తగినంత, కారం – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్.

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
వెల్లుల్లి నువ్వుల కారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత నువ్వులు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపు దినుసులు, కరివేపాకుతో తాళింపు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి నువ్వుల కారం తయారవుతుంది. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా నువ్వులతో కారాన్ని తయారు చేసుకుని తినవచ్చు.