బీర్ తాగితే పొట్ట పెరుగుతుందని, అధికంగా బరువు పెరుగుతారని అంటుంటారు. అది నిజమే. బీరు సేవిస్తే ఉదర భాగంలో కొవ్వు చేరుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 46 రోజుల పాటు ఇతర ఏ ఆహార పదార్థాలు తీసుకోలేదు. పానీయాలు తాగలేదు. కేవలం బీర్ మాత్రమే తాగాడు. అయితే ఏముందీ.. భారీగా బరువు పెరిగి ఉంటాడు.. అని మీరు అనుకోవచ్చు. అయితే అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. అతను బరువు పెరగలేదు.. తగ్గాడు. అది కూడా చాలా ఎక్కువ బరువు తగ్గాడు. అవును, మీరు విన్నది నిజమే.
అమెరికాలోని ఓహియోలో నివాసం ఉండే డెల్ హాల్ అనే వ్యక్తి సిన్సినాటిలోని ఫిఫ్టీ వెస్ట్ బ్రూయింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఓ వింత ఆలోచన వచ్చింది. అందరూ రక రకాల డైట్లను పాటిస్తున్నారు కదా.. తాను కూడా ఏదైనా వినూత్నమైన డైట్‌ను పాటిస్తే ఎలా ఉంటుంది ? అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే బీర్ డైట్ ప్రారంభించాడు. 46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే తాగాడు. అది కూడా ఆకలి వేసినప్పుడు మాత్రమే. ఇతర ఏ ఆహారాలను, పానీయాలను తీసుకోలేదు. అయితే 46 రోజుల తరువాత షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి.
అలా డెల్ హాల్ 46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే తాగే సరికి అతను ఏమాత్రం బరువు పెరగలేదు సరికదా.. బరువు తగ్గాడు. అది కూడా.. 20 కేజీలకు పైగానే. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. ఇదే వివరాలను డెల్ హాల్ ఓ యూట్యూబ్ వీడియోలో వివరించాడు. తాను 46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే తాగుతూ, బీర్ డైట్ చేసి 20 కేజీలకు పైగా బరువు తగ్గానని అతను చెబుతున్నాడు. మరి బీర్ తాగితే బరువు పెరుగుతారని, పొట్ట పెరుగుతుందని చెప్పే మాటలు నిజం కావా..? అంటే.. ఏమో.. ఆ విషయాన్ని ఎవరికి వారు నిర్దారించుకోవాలి. అలా అని చెప్పి గుడ్డిగా మీరు కూడా బీర్ డైట్ ఫాలో కాకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి..!