Thotakura Pakoda : తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలిసిందే. దీనిని వారంలో రెండు నుండి మూడు సార్లు తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. తోటకూరతో మనం రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. కూరలే కాకుండా తోటకూరతో మనం చిరుతిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూరతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో తోటకూర గట్టి పకోడి కూడా ఒకటి. ఈ పకోడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. తోటకూర గట్టి పకోడిని కరకరలాడుతూ రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర గట్టి పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 15, పచ్చిమిర్చి – 4, సోంపు గింజలు -ఒక టీ స్పూన్, తోటకూర తరుగు – 2 కప్పులు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, శనగపిండి – 200 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగనంత, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – పావు కప్పు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
తోటకూర గట్టి పకోడి తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, సోంపు గింజలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో తోటకూర తరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్, బియ్యం పిండి, శనగపిండి, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి తోటకూరను నలుపుతూ కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పకోడికి పిండి పొడి పొడిగానే ఉంటుంది. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పకోడిలా వేసుకోవాలి. ఈ పకోడీలను మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర గట్టి పకోడి తయారవుతుంది. పచ్చిమిర్చి తింటూ ఈ పకోడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పకోడి 3 నుండి 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ పకోడి చక్కగా ఉంటుంది.