Tomato Drumstick Curry : మనం మునక్కాయలను ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. మునక్కాయల వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటో మనందరికీ తెలుసు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మునక్కాయలు ఎంతో సహాయపడతాయి. ఎముకలను దృఢంగా చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో మునక్కాయలు ఉపయోగపడతాయి. పొట్టలో పేగుల కదలికలను పెంచి మలబద్దకాన్ని తగ్గించడంలో కూడా ఇవి దోహదపడతాయి. రక్తాన్ని శుద్ది చేయడంలో మునక్కాయలు సహాయపడతాయి. మనం ఎక్కువగా మునక్కాయలను సాంబార్, పప్పుచారు వంటి వాటిల్లో వాడుతూ ఉంటాం. టమాటా మునక్కాయ కూరను కూడా మనం వండుకుని తింటుంటాం. అయితే దీన్ని సరిగ్గా చేయడం రావడం లేదని కొందరు విచారిస్తుంటారు. అలాంటి వారు కింద తెలిపిన విధంగా చేస్తే టమాటా మునక్కాయ కూర చక్కగా వస్తుంది. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మునక్కాయ మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మునక్కాయలు – 2, తరిగిన టమాటాలు – అర కిలో, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 2, దాల్చిన చెక్క ముక్క – 1, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, నీళ్లు – ఒక గ్లాసు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట మునక్కాయ మసాలా కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5 నిమిషాల తరువాత తరిగిన టమాటాలను వేసి కలిపి, మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడొ, ఒక గ్లాసు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే టమాట మునక్కాయ మసాలా కూర తయారవుతుంది. అన్నంతో లేదా చపాతీలతో దేంతో కలిపి తిన్నా సరే.. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా టమాటాలు, మునక్కాయల్లో ఉండే పోషకాలన్నీ మనకు లభిస్తాయి.