Green Gram : పెసలను సాధారణంగా చాలా మంది గుగ్గిళ్లుగా చేసుకుని తింటుంటారు. కొందరు ఉడకబెట్టి తింటుంటారు. కొందరు మొలకలుగా చేసుకుని.. ఇంకొందరు పెసరట్లుగా వేసుకుని తింటుంటారు. అయితే పెసలను చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ వీటితో మనకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెసలను రోజూ తినాలే కానీ అనేక లాభాలను పొందవచ్చు. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణ సమస్యలు అసలు ఉండవు. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి. అలాగే పెసలను క్రమం తప్పకుండా రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
పెసలలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. కనుక పోషకాహార లోపంతో బాధపడుతున్నవారికి పెసలు సరైన ఆహారం అని చెప్పవచ్చు. వీటిని రోజూ తింటే పోషకాహార లోపం తగ్గుతుంది. అలాగే వీటిల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగాలు రాకుండా రక్షిస్తుంది. పెసలలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. వీటిల్లో మెగ్నిషియం కూడా ఎక్కువే. కనుక మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది.
ఇక పెసలను తినడం వల్ల కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల ఎముకలను దృఢంగా మార్చుకోవచ్చు. రక్తహీనత తగ్గుతుంది. అలాగే వీటిల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. పెసలలో ఉండే విటమిన్ ఇ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఇలా పెసలతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని మొలకెత్తించి లేదా ఉడకబెట్టి తినవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే మొలకలను తింటే మేలు. అదే సాయంత్రం అయితే ఉడకబెట్టి తినాలి. దీంతో వీటి ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.