Tomato Pachadi : మనలో చాలా మంది టమాట పచ్చడిని ఇష్టంగా తింటారు. టమాట పచ్చడిని వివిధ రుచుల్లో వివిధ పద్దతుల్లో తయారు చేస్తూ ఉంటారు. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా టమాట పచ్చడిని కింద చెప్పిన విధంగా రుచిగా, వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే టమాట పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో, అల్పాహారాలతో తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకుని కడుపు నిండుగా భోజనం చేయవచ్చు. మరింత రుచిగా, వెరైటీగా టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 15, తరిగిన టమాటాలు – పావుకిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర- గుప్పెడు.
టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో మినపప్పు వేసి వేయించాలి. ఇది కొద్దిగా వేగిన తరువాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత నువ్వులు కూడా వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చిని చక్కగా వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని అదే కళాయిలో టమాట ముక్కలు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి మూత పెట్టి మగ్గించాలి. టమాట ముక్కలు మగ్గుతుండగా జార్ లో ముందుగా వేయించిన దినుసులు, ఎండుమిర్చి వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, దంచిన వెల్లుల్లి రెమ్మలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన టమాట పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.