Tomato Pepper Soup : వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియడం లేదు. వాతవరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఉన్నట్టుండి వర్షం పడుతుంది. దీంతో వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. శరీరానికి వెచ్చదనాన్ని అందంచడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే వాటిని తీసుకోవాలి. శరీరానికి వెచ్చదనాన్ని అందించడంలో సూప్ చక్కగా పని చేస్తుంది. టమాట మిరియాల పొడి వేసి చేసే సూప్ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. దీనిని తయారు చేయడం కూడా తేలిక. రుచిగా, కమ్మగా, వేడి వేడిగా టమాట మిరియాల సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మిరియాల సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 3, తాజా మిరియాల పొడి – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, అల్లం ముక్క -ఒక ఇంచు ముక్క, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క, ఉల్లిపాయ – 1, నూనె – ఒక టీ స్పూన్, పుదీనా – కొద్దిగా.
టమాట మిరియాల సూప్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక కప్పు నీటిని తీసుకోవాలి. ఇందులోనే టమాట ముక్కలు, అల్లం, దాల్చిన చెక్క, మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత టమాట మిశ్రమం వేసి కలపాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై దగ్గర పడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని దానిపై కొద్దిగా మిరియాల పొడి చల్లుకుని పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టమాట మిరియాల సూప్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తీసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా టమాట మిరియాల సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వాతావరణం మారినప్పుడు ఇలా సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.