Tomato Pudina Chutney : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసుకోదగిన పచ్చళ్లల్లో టమాట పుదీనా పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా దీనిని టిఫిన్ అమ్మే బండ్ల మీద, టిఫిన్ సెంటర్లల్లో తయారు చేస్తూ ఉంటారు. అల్పాహారాలతో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అచ్చం టిఫిన్ సెంటర్ లో వచ్చే రుచితో ఈ పచ్చడిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా తేలిక. టిపిన్ సెంటర్ స్టైల్ టమాట పుదీనా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పుదీనా పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 10, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 20, తరిగిన టమాటాలు – 4, ఉప్పు – తగినంత, చింతపండు – రెండు రెమ్మలు, పుదీనా ఆకులు – పెద్ద గుప్పెడు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు -ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్.
టమాట పుదీనా పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నువ్వులను వేసి వేయించాలి. తరువాత ఈ నువ్వులను జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. టమాట ముక్కలను సగానికి పైగా వేగిన తరువాత చింతపండు వేసి కలపాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత పుదీనా వేసి మెత్తబడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని, మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పుదీనా పచ్చడి తయారవుతుంది. దీనిని అల్పాహారాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అన్నంతో కూడా తినవచ్చు. ఎప్పుడూ ఒకే రకం పచ్చడి కాకుండా అప్పుడప్పుడూ ఈ విధంగా కూడా టమాట పుదీనా పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.