Tripakam : శనగపిండితో మనం రకరకాల పిండి వంటకాలను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. శనగపిండితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. తరచూ చేసే వంటకాలతో పాటు శనగపిండితో మనం కింద చెప్పిన విధంగా త్రిపాకాన్ని కూడా తయారు చేసుకుని తినవచ్చు. శనగపిండితో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 20 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు రుచిగా, సులభంగా, చాలా తక్కువ సమయంలో ఈ తీపి వంటకాన్ని తయారు చేసుకుని తినవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ చక్కటి తీపి వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిపాకం తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, పటిక బెల్లం – ఒక కప్పు, జీడిపప్పు -ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – రెండు కప్పులు, నెయ్యి – అర కప్పు, కుంకుమ పువ్వు నీళ్లు – కొద్దిగా.

త్రిపాకం తయారీ విధానం..
ముందుగా పటిక బెల్లాన్ని దంచి జార్ లో వేయాలి. దీనిని మెత్తని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇదే జార్ లో జీడిపప్పు వేసి కొద్దిగా పలుకులు ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో శనగపిండి వేసి చిన్న మంటపై కొద్దిగా రంగు మారే వరకు కలుపుతూ వేయించాలి. శనగపిండి వేగగానే స్టవ్ ఆఫ్ చేసి పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తరువాత పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి మధ్యస్థ మంటపై దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. శనగపిండి మిశ్రమం దగ్గర పడిన తరువాత పటిక బెల్లం పొడి, కుంకుమ పువ్వు నీళ్లు పోసి కలపాలి.
తరువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం కళాయికి అంటుకోకుండా నెయ్యి పైకి తేలే వరకు ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పొడి వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు చక్కగా కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే త్రిపాకం తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. శనగపిండితో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా రుచిగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.