Tuesday : సాధారణంగా మంగళవారం, శుక్రవారం అప్పు ఇవ్వకూడదని అలా ఇస్తే లక్ష్మీ దేవిని ఇచ్చినట్టేనని అంటూ ఉంటారు. అయితే మనం ఇతరులకు ఇవ్వడమే కాదు మనం కూడా అప్పు తీసుకోకూడదని హెచ్చరిస్తుంది జ్యోతిష్య శాస్త్రం. మంగళవారాన్ని కుజుడు పాలిస్తాడు. కుజున్ని భూమాత పుత్రునిగా హిందూ మతం, భారతీయ జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. భూమి పరిమాణంతో పోల్చినప్పుడు కుజ గ్రహ పరిమాణం సగం ఉంటుందట. కాబట్టి ఈ గ్రహ ప్రభావం భూమి మీద ఉండే మనుషులపై చాలా బలంగా ఉంటుందని వేద శాస్త్రం చెబుతుంది.
కుజ గ్రహ స్వభావం చాలా ముతకగా ఉంటుంది. అనగా ఈ గ్రహ ప్రభావం సున్నితంగా ఉండదు. గొడవలు, ప్రతీకారాలను కలిగి ఉంటుంది. చాలా వరకు కుజ గ్రహాన్ని క్రూరమైన తత్వం కలిగించడానికి కారణమవుతుందని భావిస్తారు. కుజుడు కలహాలకు, తగాదాలకు, నష్టాలకు కారకుడు. అందుకే కుజ గ్రహ ప్రభావం ఉన్న మంగళవారం నాడు సాధారణంగా శుభ కార్యాలను తలపెట్టరు. మంగళవారం నాడు గోర్లు కత్తిరించడం, క్షవరం వంటి పనులను చేయరు. అందుకే ఆదివారం కంటే మంగళవారం నాడే క్షవరశాలలు మూత పడతాయి. మంగళవారం నాడు డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు రావడం కూడా చాలా కష్టమవుతుంది.
అలాగే మంగళవారం నాడు అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు కారణమై అప్పు తీరకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. కొందరు మంగళవారం నాడు ఇంటి బూజును కూడా దులపరు. కొందరు మంగళవారం నాడు పుట్టింటి నుండి ఆడపిల్లను కూడా పంపరు. ఆడపిల్లను ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజలు చేసే మంగళ, శుక్ర వారాల్లో డబ్బులు ఇవ్వడం కానీ ఆడపిల్లను పంపడం కానీ చేయరు. ఇక మంగళవారం నాడు కొత్తబట్టలు వేసుకోవడం, తలంటు పోసుకోవడం వంటివి కూడా చేయరు.
మంగళ వారం నాడు ఈ నియమాలను పాటించే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఈ నియమాలను పాటించడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని కొందరు హేతువాదులు అంటున్నారు. కొందరు మంగళవారం నాడు ఉపవాసం చేస్తూ ఉంటారు. అలాంటి వారు రాత్రి ఉప్పు వేసిన పదార్థాలను తీసుకోకూడదు. ఈ నియమాలను పాటించడం పాటించకపోవడం అనేది మన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.