Ulli Paratha : ఉల్లిపరాటా.. గోధుమపిండి, ఉల్లిపాయలు కలిపి చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. మెత్తగా, రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ పరాటాలను తయారు చేయడం చాలా సులభం. అల్పాహారంగా అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పరాటాలు చాలా చక్కగా ఉంటాయి. గోధుమపిండితో తయారు చేస్తున్నాము కనుక ఈ పరాటాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కింద చెప్పిన విధంగా తయారు చేయడం వల్ల మొదటిసారి చేసే వారు కూడా ఈ పరాటాలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మెత్తగా, ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియన్ పరాటాలను పంజాబీ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – కొద్దిగా, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్.
ఉల్లి పరాటా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, నెయ్యి లేదా నూనె వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని చక్కగా కలుపుకున్న తరువాత మరో రెండు నిమిషాల పాటు వత్తుతూ బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి.ఇప్పుడు గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని మరోసారి కలుపుకుని సమ భాగాలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ ముందుగా చేత్తో పూరీ పరిమాణంలో వత్తుకోవాలి.
తరువాత దీని మధ్యలో ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసి వేయాలి. తరువాత పొడి పిండి చల్లుకుంటూ పరోటాలాగా నెమ్మదిగా వత్తుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పరాటాలను వేసి కాల్చుకోవాలి. ముందు రెండు వైపులా కాల్చుకున్న తరువాత నెయ్యి, బటర్ లేదా నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపరాటా తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పరాటా చాలా చక్కగా ఉంటుంది.