Vamu Annam : మన వంట గదిలో ఉండే పదార్థాల్లో వాము ఒకటి. వాము చక్కటి వాసనను, ఘూటు రుచిని కలిగి ఉంటుంది. వామును వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వాములో ఔషధ గుణాలు ఉంటాయని, దీనిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెండంలో, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఈ వాము మనకు ఎంతో సహాయపడుతుంది. వామును వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వంటల్లో వాడడమే కాకుండా వాముతో ఎంతో రుచిగా ఉండే వాము అన్నాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వాముతో రుచిగా వాము అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాము అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒకటిన్నర గ్లాస్ బియ్యంతో వండినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
వాము అన్నం తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని పొడిపొడిగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వాము వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వాము అన్నం తయారవుతుంది.
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా వాము అన్నాన్ని తయారు చేసుకుని తినవచ్చు. తాజాగా వండిన అన్నంతోనే కాకుండా మిగిలిన అన్నంతో కూడా ఈ వాము అన్నాన్ని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వారానికి ఒకసారి ఇలా వాము అన్నాన్ని తయారు చేసుకుని తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.