Vellulli Karam Podi : వెల్లుల్లి.. దీనిని మనం వంటల్లో విరివిరిగా వాడుతూ ఉంటాము. వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పెయిన్ కిల్లర్ లా వెల్లుల్లి పని చేస్తుంది. శరీరంలో జీవక్రియల రేటును పెంచుతుంది. ఈ విధంగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను వెల్లుల్లి మనకు అందిస్తుంది. వంటల్లో వాడడంతో పాటు ఈ వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కారం పొడి చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. రుచిగా, ఎంతో కమ్మగా ఉండే ఈ వెల్లుల్లి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి పాయ – 1, ఎండుమిర్చి – 12 నుండి 15, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – గుప్పెడు, ఉప్పు – తగినంత, చింతపండు – ఒక రెమ్మ.
వెల్లుల్లి కారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత తరువాత ధనియాలు, జీలకర్ర వేసి మాడిపోకుండా కలుపుతూ వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకును కరకరలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని పూర్తిగా చల్లారిన తరువాత జార్ లో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, చింతపండు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం పొడి తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. ఈ విధంగా వెల్లుల్లితో కారం పొడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.