Salt : ఇప్పుడంటే మనం దేన్నయినా శుభ్రం చేయాలంటే వస్తువుకు తగినట్టుగా రక రకాల స్ప్రేలు, పౌడర్లను వాడుతున్నాం. కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు మన పూర్వీకులు కేవలం ఉప్పుతోనే ఆయా వస్తువులను ఎంతో శుభ్రం చేసుకునే వారు. అవును, ఉప్పే. ఎందుకంటే అందులో ఉండే పలు గుణాల వల్ల ఉప్పును అనేక విధాలుగా శుభ్రం చేసే కారకంగా మన వాళ్లు ఉపయోగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఉప్పుతో మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, దాంతో వేటిని శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కొద్దిగా ఉప్పును మీ ఇంట్లోని తలుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్రదేశాల్లో చల్లండి. దీంతో చీమలు రావు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే తేమ వాతావరణం కూడా పొడిగా అవుతుంది. కొద్దిగా ఉప్పు, కొంత యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీంతో రాగి, వెండి, ఇత్తడి పాత్రలను తోమితే అవి తళతళా మెరుస్తాయి. రెండు, మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును 3.5 లీటర్ల గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. దీన్ని ఉపయోగించి కిటికీ తలుపులు, గ్లాస్ విండోస్, కార్ విండోస్లను క్లీన్ చేస్తే శుభ్రంగా మెరుస్తాయి. పైన చెప్పిన ఉప్పు, గోరు వెచ్చని నీటి మిశ్రమాన్ని ఉపయోగించి కిచెన్ సింక్‌ను క్లీన్ చేస్తే అందులో జామ్ అయిన పదార్థాలన్నీ పోతాయి.
కొద్దిగా ఉప్పు, లవంగ నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. అనంతరం కొంత సేపు ఆగాక స్నానం చేయాలి. దీంతో చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది. కొంత నీటిలో ఉప్పును వేసి బాగా కలిపి ఆ నీటిలో ఒక గుడ్డ ముక్కను ముంచి దాంతో కార్పెట్లు, దుప్పట్లు, దుస్తులపై పడ్డ మరకలను తుడవాలి. దీంతో ఆ మరకలు ఇట్టే తొలగిపోతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని 1 నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి.
బేకింగ్ సోడా, ఉప్పును సమాన భాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీన్ని కొంత నీటికి కలిపి పేస్ట్‌లా చేసి దాంతో పళ్లు తోముకుంటే పళ్లు మిలమిలా మెరుస్తాయి. దుస్తులను డిటర్జెంట్ లేదా సబ్బుతో ఉతికిన తరువాత నీటిలో కొద్దిగా ఉప్పును వేసి ఆ నీటిలో దుస్తులను ముంచి తీయాలి. దీంతో దుస్తులు ష్రింక్ అవవు. దీనికి తోడు బట్టలు శుభ్రంగా, మృదువుగా మారుతాయి.