రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్‌లో వారసత్వ పగ్గాల బదిలీ ఎలా జరుగుతుంది అందరిలో ఆసక్తి నెలకొంది. టాటా ట్రస్టులకు ఛైర్మన్‌గా, రతన్ టాటా వారసుడిగా 67 ఏళ్ల నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన గురించి అందరు ఆరాలు తీస్తున్నారు. టాటా గ్రూప్‌లో పెద్ద బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఆయన పేరు పెద్దగా వార్తల్లో కనిపించలేదు. మరి ఆయన రతన్ టాటాకు ఏమవుతారు? ఆయన భార్య, పిల్లలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాటా ట్రస్ట్స్ కొత్త చైర్మన్‌గా రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా (67) నియమితులయ్యారు. ముంబైలో శుక్రవారం జరిగిన టాటా ట్రస్ట్స్ ట్రస్టీల సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఇక వివరాలలోకి వెళితే నావల్ టాటాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సూని కుమారుడు రతన్ టాటా, జిమ్మి టాటా. 1940లో నావల్ టాటా, సూనీ టాటాలు విడిపోయారు. 1955లో సిమోనే అనే స్విస్ వ్యాపారవేత్తను నావల్ టాటా పెళ్లి చేసుకున్నారు. వారికు జన్మించిన వాడే ఈ నోయల్ టాటా. నోయల్ టాటా సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు. విదేశాల్లో బిజినెస్ చేసే టాటా ఇంటర్నేషనల్ సంస్థలో నోయల్ టాటా తన కెరీర్ ప్రారంభించారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఈక్విటీలో 66 శాతం వాటా ఉంది. దాదాపు ఈ ట్రస్టులన్నిటిలో నోయల్ టాటా ఇప్పటికే ట్రస్టీగా ఉన్నారు. టాటా గ్రూప్ కంపెనీలైన వోల్టాస్, టాటా ఇంటర్నేషనల్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వంటి అనేక టాటా గ్రూప్ కంపెనీలకూ నోయల్ చైర్మన్‌గా ఉన్నారు. వీటికి తోడు టాటా స్టీల్, టైటాన్ కంపెనీలకు వైస్ చైర్మన్‌గానూ నోయల్ టాటా వ్యవహరిస్తున్నారు.
నావెల్ హెచ్ టాటా.. నోయల్ టాటా తండ్రి. తల్లి సిమోన్ హెచ్ టాటా స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త. సిమోన్ హెచ్ టాటా కంటే ముందే నావెల్ హెచ్ టాటా రతన్ టాటా తల్లి సూనూ కమిశారియట్‌ను వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి ద్వారా నావెల్ హెచ్ టాటాకు రతన్, జిమ్మీ జన్మించారు. ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో నోయల్ టాటా మాత్రమే వివాహితుడు. నోయల్ టాటా భార్య ఆలూ మిస్త్రీ.. రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్ పగ్గాలు చేపట్టిన సైరస్ మిస్త్రీకి స్వయానా సోదరి. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ కుమార్తె. నోయల్ టాటా-ఆలూ మిస్త్రీ దంపతులకు లీ, మాయ అనే కుమార్తెలతో పాటు నెవిల్లే అనే ఒక కుమారుడు ఉన్నారు. ఇందులో లీ టాటా.. ప్రస్తుతం తాజ్ హోటల్స్‌ను నిర్వహించే ది ఇండియన్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా, మాయా టాటా క్యాపిటల్ కంపెనీలో ఉన్నత స్థానాల్లో పని చేస్తున్నారు. కుమారుడు నెవిల్లే కూడా ట్రెంట్, స్టార్ బజార్ సారథ్య బాధ్యతలు చూసుకుంటున్నారు.