Lord Hanuman : రామాయణంలో.. రావణుడి చేత అపహరించబడిన సీత జాడ కనుగొనేందుకు రాముడు హనుమంతున్ని పంపుతాడు కదా. దీని గురించి చాలా మందికి తెలుసు. అయితే సీత అన్వేషణలో భాగంగా లంకకు వెళ్లిన హనుమంతుడు ఆమెను కనుగొన్నాక లంకలో చాలా అల్లరి చేస్తాడు. దీంతో లంకలో ఉండే రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు పెడతారు. అయితే హనుమ ఊరుకుంటాడా..? ఆ మంటతో మొత్తం లంకకు నిప్పు పెడతాడు. అందులో భాగంగా లంక చాలా వరకు దహనమవుతుంది. అయితే అప్పటికే హనుమంతుని తోక చాలా వరకు కాలి పోతుందట. మరి అలా కాలిన తోకకు ఏదో ఒక ఉపశమనం చేయాలి కదా. అదిగో ఆ భక్తులు చేస్తున్నదదే. ఇంతకీ వారేం చేస్తున్నారు..?
అది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సుచీంద్రం. ఈ క్షేత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలసి ఒకే లింగం రూపంలో ఉద్భవించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైందిగా భక్తులచే ఆదరణ పొందుతోంది. ఎంతో మంది ఈ క్షేత్రానికి వచ్చి స్వామివార్లను దర్శించుకుంటారు కూడా. ఈ క్షేత్రంలోనే హనుమంతుడికి చెందిన 18 అడుగుల ఎత్తైన విగ్రహం కూడా ఉంది. స్వామివారు కూడా ఇక్కడ భక్తులచే విశేష నీరాజనాలు అందుకుంటూ ఉంటాడు. అయితే ఈ హనుమ విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే..
లంకా దహనంలో హనుమ తోక చాలా వరకు కాలిపోయిందని చెప్పాం కదా. అయితే కాలిన ఆ తోకకు ఉపశమనంగా అప్పట్లో ఆయన భక్తులు వెన్న రాశారాట. ఈ క్రమంలోనే సుచీంద్రం క్షేత్రంలో ఉన్న హనుమ విగ్రహ తోకకు కూడా భక్తులు చాలా మంది వెన్న రాస్తుంటారు. అలా రాస్తే ఆయనకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతే కాదు, అలా చేయడంవల్ల స్వామి ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆ క్షేత్రానికి వెళ్లిన భక్తులు ఎవరైనా స్వామి వారి తోకకు వెన్న రాసి గానీ వెనక్కి రారు. చివరిగా ఇంకో విషయమేమిటంటే.. అలా స్వామి వారి తోకకు వెన్న రాసే సాంప్రదాయం ఈనాటిది కాదట. తరతరాల నుంచి వస్తున్నదేనట.