Punugu Pilli Tailam : ఈ భూమి మీద ఉండే వివిధ రకాల జంతువుల్లో పునుగు పిల్లి కూడా ఒకటి. దీనిని ఆంగ్లంలో టాడీ క్యాట్ అని సివియట్ క్యాట్ అని పిలుస్తారు. పునుగు పిల్లుల్లో సుమారు 38 జాతుల వరకు ఉన్నాయి. ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లుల్లో ఒక విశిష్టత ఉంటుంది. ఈ జాతులకు చెందిన పునుగు పిల్లుల గ్రంథుల నుండి పునుగు తైలమనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. ఈ తైలాన్నే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి రాస్తారు. ఈ పునుగు తైలం స్వామి వారికి ఎంతో ఇష్టమైన తైలమని చెబుతుంటారు.
శుక్రవారం అభిషేకం తరువాత స్వామి వారి మూల విరాట్ కు పునుగు తైలాన్ని లేపనంగా రాస్తారు. ఈ తైలం కారణంగానే స్వామి వారి విగ్రహం చెక్కు చెదరకుండా నిగనిగలాడుతూ ఉంటుందని పండితులు అంటున్నారు. పునుగు పిల్లికి రెండు సంవత్సరాల వయసు రాగానే ప్రతి రోజులకు ఒకసారి గంధం చెట్టుకు తన శరీరాన్ని రుద్దుతుంది. ఆ సమయంలో దీని చర్మం నుండి వెలువడే స్రావం ఆ చెట్లకు అంటుకుంటుంది. ఆ చెట్ల నుండి సేకరించబడిన స్రావమే పునుగు తైలం.
ప్రస్తుతం అంతరించిన పోతున్న పునుగు పిల్లులను తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంరక్షించి వాటి నుండి తైలాన్ని సేకరిస్తున్నారు. అంతేకాకుండా పునుగు పిల్లులు విసర్జించే కాఫీ గింజలకు మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. పునుగు పిల్లులు బాగా పండిన కాఫీ పండ్లను తిని కాఫీ గింజలను విసర్జిస్తాయి. ఈ గింజలను సేకరించి పొడిగా చేసి అమ్ముతారు. ఈ కాఫీ పొడికి మార్కెట్ లో కిలోకు రూ.20 వేల నుండి రూ.25 వేల ధర పలుకుతోంది. కాఫీ పండ్లను తిన్న వాటి పొట్టలో స్రవించే కొన్ని ద్రవాల కారణంగా కాఫీ గింజల్లో పోషకాలు మరింత పెరుగుతాయట. సివియట్ కాఫీ ని చాలా ఇష్టంగా తాగే వారు కూడా ఉన్నారు.