Tomato Ketchup : సాధారణంగా మనం ఇంట్లో లేదా బయట లభించే చిరుతిళ్లను ఎక్కువగా టమాట కెచప్ తో కలిపి తింటాం. ఈ టమాట కెచప్ తియ్యగా, పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. టమాట కెచప్ తో తినడం వల్ల మనం తినే ఆహార పదార్థాల రుచి మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. దీనిని మనం బయట ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం. బయట నుండి కొనుగోలు చేసే పని లేకుండా ఈ టమాట కెచప్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని రుచి, ఆకృతి కూడా అచ్చం బయట లభించే టమాట కెచప్ లాగే ఉంటాయి. ఇంట్లో టమాట కెచప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కెచప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాగా పండిన టమాటాలు – ఒక కిలో, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – ఒక టీ స్పూన్, చిన్న ఉల్లిపాయ ముక్క – 1, ఎండు మిర్చి – 4, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, లవంగాలు – 2, నీళ్లు – పావు కప్పు, పంచదార – అర కప్పుకు కొద్దిగా తక్కువ, వైట్ వెనిగర్ – పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్.
టమాట కెచప్ తయారీ విధానం..
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి వాటిపై ఆకుపచ్చ రంగులో ఉండే తొడిమెను తీసేసి 8 ముక్కలుగా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాట ముక్కలను ఒక కుక్కర్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును, ఉల్లిపాయ ముక్కలను, ఎండుమిర్చిని, దాల్చిన చెక్కను, లవంగాలను, నీళ్లను పోసి మూత పెట్టాలి. ఈ కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా ఉడికించుకున్న టమాట ముక్కలు పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి.
ఈ టమాట ముక్కలను వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో జల్లిగంటెను ఉంచి దానిలో టమాట మిశ్రమాన్ని వేసి వడకట్టుకోవాలి. తరువాత అడుగు భాగం మందంగా ఉండే కళాయిని తీసుకుని అందులో వడకట్టుకున్న టమాట మిశ్రమాన్ని వేసి మధ్యస్థ మంటపై కలుపుతూ వేడి చేయాలి. ఇలా వేడి చేస్తూనే దీనిలో పంచదారను వేసి కలుపుకోవాలి. పంచదార కరిగిన తరువాత వైట్ వెనిగర్ ను వేసి కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన కార్న్ ఫ్లోర్ ను టమాట మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఈ టమాట మిశ్రమాన్ని 5 నుండి 10 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మనం తయారు చేసిన టమాట కెచప్ చల్లారిన తరువాత మరింత దగ్గరగా అవుతుంది. కనుక కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా అచ్చం బయట లభించే విధంగా ఉండే టమాట కెచప్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న టమాట కెచప్ ను మూత ఉండే గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల 2 నెలల పాటు తాజాగా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్న చిరుతిళ్లను ఇలా తయారు చేసుకున్న టమాట కెచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.