Curd : పాలతో తయారు చేసే ఆహార పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. దీనిని ఏదో ఒక రూపంలో మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు ఎంతో కమ్మని రుచిని కలిగి ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇవ్వడంలో పెరుగును మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాల్లో దీనిని అమృతంతో పోలుస్తారు. విదేశాల్లో ఎక్కువగా ఆవు పాలతో పెరుగును తయారు చేస్తారు. కానీ మన దగ్గర ఎక్కువగా గేదె పాలతో పెరుగును తయారు చేస్తారు. రష్యా వంటి దేశాల్లో గొర్రెలు, మేకల పాలతో కూడా పెరుగును తయారు చేస్తారు.
పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగు వల్ల శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ జబ్బుల బారిన పడకుండా ఉంటాం. పెరుగులో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ పెరుగును తీసుకునే వారిలో ఆస్టియోపోరోసిస్ అనే ఎముకలకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల విటమిన్స్, మినరల్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చూడడంలో ఈ పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా పెరుగు మనకు సహాయపడుతుంది. అలాగే పెరుగును ఎక్కువగా తీసుకునే వారిలో చర్మం, జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, మెదడు పని తీరును పెంచి జ్ఞాపకశక్తిని పెంచడంలో పెరుగు మనకు దోహద పడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. డయేరియాతో బాధపడే వారికి పెరుగు చక్కటి ఆహారమని చెప్పవచ్చు. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూర్చే గుణం కూడా పెరుగుకు ఉంటుంది. పెరుగును తరుచూ తీసుకోవడం వల్ల స్త్రీలలో యోని సంబంధిత ఇన్ ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. పాలకు పెరుగు ప్రత్యామ్నాయ ఆహారమని చెప్పవచ్చు. కొందరు పాలను తాగడానికి ఇష్టపడరు. అలాంటి వారు పాలకు బదులుగా పెరుగును తీసుకోవడం వల్ల పాలల్లో ఉండే పోషకాలతోపాటు పాలను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగును తీసుకోవడం వల్ల మనం ఇటువంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇంకా ఎన్నింటినో పొందవచ్చని, దీనిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.