Zero Oil Chicken Fry : చికెన్ ఫ్రై.. చికెన్ తో వివిధ రకాల వంటకాల్లో ఇది కూడా ఒకటి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దీనిని మనం తరుచూ ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము.అయితే చికెన్ ఫ్రైను తయారు చేయడానికి ఎక్కువగా నూనె పడుతుందని మనందరికి తెలిసిందే. నూనె ఎక్కువగా వేయడం వల్లనే ముక్కలు చక్కగా వేగి రుచిగా ఉంటాయి. కానీ అస్సలు ఒక్క చుక్క నూనె వేయకుండా కూడా మనం చికెన్ ఫ్రైను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నూనె వేయకుండా చేసే చికెన్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు ఇలా నూనె లేకుండా చికెన్ ఫ్రైను తయారు చేసి తీసుకోవచ్చు. నూనె లేకుండా చికెన్ ఫ్రైను రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – కిలో, ఉప్పు – తగినంత, కారం – 3 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, చికెన్ మసాలా – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు- ఒక రెమ్మ, నీళ్లు లేకుండా వడకట్టిన మీగడ పెరుగు – అర కప్పు, నిమ్మరసం – అర చెక్క, తరిగిన పచ్చిమిర్చి – 6.
చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో పచ్చిమిర్చి తప్ప మిగిలిన పదార్థాలన్నీవేసి బాగా కలపాలి. తరువాత ఈ చికెన్ ను అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో చికెన్ ను వేసి పెద్ద మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ను పూర్తిగా ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత మూత తీసి చికెన్ లో నీరంతా పోయే వరకు వేయించాలి. ఇందులోనే పచ్చిమిర్చి, మరో రెమ్మ కరివేపాకు, ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కలపాలి. దీనిని పూర్తిగా దగ్గర పడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో తిన్నా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.