కాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకల నిర్మాణానికి సహాయ పడుతుంది. అయితే ఎముకల ఆరోగ్యానికి కేవలం కాల్షియం మాత్రమే కాదు, పలు ఇతర పోషకాలను కూడా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ డి కూడా సహాయ పడుతుంది. విటమిన్ డి తగినంతగా ఉంటేనే శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహిస్తుంది. అందువల్ల శరీరంలో విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి. విటమిన్ డి మనకు సూర్య రశ్మి ద్వారా లభిస్తుంది. అలాగే పుట్ట గొడుగులు, పాలు, కోడిగుడ్లు, చేపల ద్వారా కూడా లభిస్తుంది.
2. ఎముకలు దృఢంగా, బలంగా ఉండాలంటే ప్రోటీన్లను కూడా రోజూ తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు శరీరానికి మరమ్మత్తులు చేస్తాయి. విరిగిన ఎముకలు అతుక్కునేందుకు సహాయ పడతాయి. కనుక ప్రోటీన్లు ఉండే ఆహారాలను కూడా రోజూ తీసుకోవాలి.
3. ఎముకల ఆరోగ్యానికి మెగ్నిషియం, పొటాషియం కూడా సహాయ పడతాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి.
ప్రోటీన్లు మనకు పప్పు దినుసులు, చిక్కుడు జాతి గింజలు, చికెన్, మటన్, గుడ్లు, పాలలో లభిస్తాయి. అలాగే పొటాషియం, మెగ్నిషియం ఎక్కువగా నట్స్, సీడ్స్, పండ్లలో ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.