మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లను స్థూల పోషకాలు అని, విటమిన్లు, మినరల్స్ ను సూక్ష్మ పోషకాలు అని అంటారు. ఇవన్నీ మనకు రోజూ కావల్సిందే. లేదంటే పోషకాహార లోపం ఏర్పడుతుంది. అయితే మన దేశంలో కొన్ని పోషకాహారాల లోపాల సమస్యలు సహజంగానే చాలా మందికి కామన్‌గా ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మన దేశంలో విటమిన్ డి లోపం సమస్య చాలా మందికి ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. రోజూ కొంత సేపు సూర్య రశ్మిలో గడిపితే ఈ విటమిన్‌ను మన శరీరం దానంతట అదే తయారు చేసుకుంటుంది. అయితే ఈ విటమిన్ లోపం వస్తే డాక్టర్ల సూచన మేరకు సప్లిమెంట్లను వాడుకోవాలి. మనకు రోజుకు 600 ఐయూ మోతాదులో విటమిన్ డి అవసరం అవుతుంది. కనుక దీన్ని తప్పకుండా తీసుకోవాలి. బెండకాయలు, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, పుట్ట గొడుగులు, కొన్ని రకాల నూనెల్లో మనకు విటమిన్ డి లభిస్తుంది.
2. విటమిన్ బి12 లోపం సహజంగానే చాలా మందికి ఉంటుంది. ఇది ఎక్కువగా మాంసాహారం నుంచి లభిస్తుంది కనుక శాకాహారం తినే వారిలో ఈ విటమిన్ లోపిస్తుంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో విటమిన్ బి12 లోపం ఉంటుంది. కనుక వారు రోజూ విటమిన్ బి12 అందేలా చూసుకోవాలి. మటన్, చికెన్, కోడిగుడ్లు, చేపల్లో విటమిన్ బి12 లభిస్తుంది. ఇది రోజూ మనకు 2.4 మైక్రోగ్రాముల మోతాదులో అవసరం.
3. మన దేశంలో చాలా మందికి ఫోలేట్ లోపం కూడా ఏర్పడుతుంది. ఇది ఆకుపచ్చని కూరగాయలు, నిమ్మ జాతి పండ్లు, రాజ్మా, కోడిగుడ్లు, పప్పు దినుసుల్లో ఉంటుంది. అందువల్ల ఆయా ఆహారాలను రోజూ తీసుకుంటే ఈ పోషక పదార్థ లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక మనకు ఇది రోజుకు 400 ఎంసీజీ మోతాదులో అవసరం. అదే గర్భిణీలకు అయితే 600 ఎంసీజీ మోతాదులో అవసరం.
4. ఐరన్ లోపం కూడా చాలా మందికి ఏర్పడుతుంటుంది. దీంతో చాలా మందికి రక్తహీనత వస్తుంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నెలసరి, గర్భం దాల్చి ప్రసవించడం వంటి కారణాల వల్ల వారిలో ఐరన్ లోపం వస్తుంది. ఇందుకు గాను ఐరన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. రోజుకు మనకు 8.7 మిల్లీగ్రాముల మోతాదులో ఐరన్ అవసరం. మహిళలకు 14.8 మిల్లీగ్రాముల మోతాదులో ఐరన్ అవసరం ఉంటుంది. ఇది పాలకూర, గోంగూర, డార్క్ చాకొలెట్, దానిమ్మ, యాపిల్స్, టమాటాలు, చేపలు, మటన్‌లలో అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని తీసుకుంటే ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365