Vitamin D : మన శరీరానికి అవసరం ఉన్న విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ఇది లోపిస్తే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఎముకలు బలహీనంగా మారిపోతాయి. దీని వల్ల ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి వస్తుంది. పిల్లల్లో విటమిన్ డి లోపిస్తే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఈ క్రమంలో చిన్నారుల ఎముకలు బలహీనంగా మారుతాయి. పెళుసుగా మారి విరిగిపోయే అవకాశాలు పెరుగుతాయి.
పెద్దల్లో విటమిన్ డి లోపం వల్ల కొన్నిసార్లు ఆస్టియోమలేసియా అనే వ్యాధి వస్తుంది. ఎముకల బలహీనంగా మారడం వల్ల ఇలా జరుగుతుంటుంది. అనేక రకాల కేసుల్లో ఇది రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తుంది. విటమిన్ డి లోపిస్తే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతోపాటు బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల విటమిన్ డి ప్రాముఖ్యత గురించి ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.
విటమిన్ డి లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసుకున్నాం. అయితే మన శరీరంలో విటమిన్ డి లోపం ఎందుకు ఏర్పడుతుంది ? దీని వెనుక కారణాలు ఏముంటాయి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ డి సహజంగానే పాలు, పాల సంబంధ పదార్థాలతోపాటు మాంసాహార ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. కనుక పూర్తి స్థాయిలో వెజిటేరియన్ డైట్‌ను పాటించే వారికి విటమిన్ డి సరిగ్గా లభించదు. ఇలాంటి వారిలో విటమిన్ డి లోపం వస్తుంటుంది. అలాగే సూర్యరశ్మి తగలకుండా ఎక్కువ సేపు ఇంట్లో లేదా ఆఫీసులో కూర్చుని ఉండే వారు, పనిచేసేవారిలోనూ విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.
ఇక కిడ్నీ సమస్యలు ఉన్నా, జీర్ణ క్రియ వ్యవస్థ పనితీరు బాగా లేకపోయినా, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నా.. మన శరీరం విటమిన్ డి ని తయారు చేసుకోలేదు. ఈ కారణాల వల్ల కూడా విటమిన్ డి లోపం ఏర్పడుతుంటుంది. కనుక విటమిన్ డి లోపం ఉన్నవారు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సూర్యరశ్మిలో ఉదయం 8 గంటల లోపు రోజూ కనీసం 30 నిమిషాల పాటు గడపాలి. దీని వల్ల మన శరీరం తనంతట తానుగా విటమిన్ డిని తయారు చేసుకుంటుంది.
ఇక విటమిన్ డి ఉండే ఆహారాల విషయానికి వస్తే.. విటమిన్ డి మనకు కాడ్ లివర్ ఆయిల్, చేపలు, పుట్ట గొడుగులు, సోయా ఉత్పత్తులు, కోడిగుడ్లు, మటన్ లివర్, వెన్న, బ్రొకొలి, క్యారెట్, బాదంపప్పు వంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుంది. శాకాహారం తినేవారు పాలు, చీజ్, పెరుగు, పుట్టగొడుగులు, క్రీమ్, వెన్నలను ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ డిని పొందవచ్చు. మాంసాహారులు అయితే చేపలు, కోడిగుడ్లను తినడం ఉత్తమం.
నారింజ పండ్లలోనూ విటమిన్ డి సమృద్ధిగానే ఉంటుంది. కనుక ఈ పండ్లను కూడా రోజుకు ఒకటి చొప్పున తినవచ్చు. విటమిన్ డి మరీ తక్కువగా ఉన్నవారు వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను వాడవచ్చు.