పుచ్చకాయలు ఎంతో రుచికరంగా ఉండడమే కాదు మనకు తాజాదనాన్ని అందిస్తాయి. వాటిని తినడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తినడం వల్ల కేవలం 46 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. విటమిన్ సి, ఎ లు ఈ పండ్లలో అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరమైన వృక్ష సంబంధ సమ్మేళనాలు కూడా పుచ్చకాయల్లో అధికంగా ఉంటాయి.
పుచ్చకాయలను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయలను తినడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. అలాంటి వారు ఆ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే పుచ్చకాయలను తినాల్సి ఉంటుంది. పుచ్చకాయల్లో 92 శాతం నీరు ఉంటుంది. అందువల్ల వాటిని తింటే మన శరీరంలో ద్రవాలు పెరుగుతాయి.
ఒక కప్పు పుచ్చకాయ ముక్కల్లో కేవలం 46 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల బరువు పెరుగుతారన్న భయం ఉండదు. ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తినడం వల్ల మనకు నిత్యం అవసరం అయ్యే విటమిన్ సి లో 21 శాతం మేర లభిస్తుంది. విటమిన్ ఎ 18 శాతం, పొటాషియం 5 శాతం, మెగ్నిషియం 4 శాతం, విటమిన్లు బి1, బి5, బి6 లు 3 శాతం లభిస్తాయి. వీటితోపాటు పుచ్చకాయల్లో కెరోటినాయిడ్స్, సిట్రులైన్ అనబడే ముఖ్యమైన అమైనో యాసిడ్ ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి పోషణను అందిస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి.
పుచ్చకాయల్లో లైకోపీన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటుంది. లైకోపీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల వల్ల ఏటా అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. అస్తవ్యస్తమైన జీవన విదానం, సరైన ఆహారం తీసుకోకపోవడం, హైబీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మంది ఏటా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే పుచ్చకాయల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. పుచ్చకాయల్లోని లైకోపీన్ కొలెస్ట్రాల్, హైబీపీలను తగ్గిస్తుంది. అలాగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరగకుండా చూస్తుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. అలాగే రక్త నాళాలు గట్టి పడడం తగ్గుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు.
మన శరీరంలో అనేక భాగాల్లో వాపులు వస్తే మనం అనారోగ్యాల బారిన పడతాం. అయితే పుచ్చకాయలు ఆ వాపులను తగ్గిస్తాయి. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
పుచ్చకాయల్లో ఉండే లైకోపీన్ కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి వ్యాధులను రాకుండా చూస్తుంది. దృష్టి లోపాలు తగ్గుతాయి.
పుచ్చకాయల్లో ఉండే విటమిన్లు ఎ, సి లు చర్మం, వెంట్రుకలను సంరక్షిస్తాయి. విటమిన్ సి వల్ల మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మం, వెంట్రుకలు సంరక్షించబడతాయి. వెంట్రుకలు దృఢంగా మారుతాయి. విటమిన్ ఎ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది. పుచ్చకాయల్లో ఉండే లైకోపీన్, బీటా కెరోటీన్‌లు చర్మాన్ని సూర్యకిరణాల బారి నుంచి రక్షిస్తాయి. చర్మం కందిపోకుండా ఉంటుంది.
పుచ్చకాయల్లో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పాటును అందిస్తుంది. జీర్ణవ్యవస్థలో ఆహారం సరిగ్గా ముందుకు కదులుతుంది. నిత్యం మలబద్దకం సమస్య ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది.