Flax Seeds : మన శరీరంలో రక్త ప్రసరణ రక్త నాళాల ద్వారా జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా జరిగినప్పుడే అవయవాలు వాటి విధులను సక్రమంగా నిర్వర్తిస్తాయి. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ రక్త ప్రసరణ అవయవాలకు సక్రమంగా జరగనప్పుడు అవయవాలు తమ విధులను సరిగ్గా నిర్వర్తించకపోవడం, అవయవాలు దెబ్బ తినడం వంటివి జరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్త నాళాలలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) రక్త ప్రసరణ సాఫీగా జరగకుండా అడ్డుపడుతుంది. దీంతో సమస్యలు తలెత్తుతాయి.
రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకు పోయిన చోటు నుండి కింది భాగానికి రక్త ప్రసరణ అందక అవయవాలు దెబ్బ తినడం వంటివి జరుగుతుంది. శరీరంలోని గుండె, మెదడు తప్ప ఏ ఇతర అవయావాలకు రక్త ప్రసరణ సాఫీగా జరగక పోయినా అది ప్రాణాంతకం కాదు. కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే తలెత్తుతాయి. గుండె, మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా జరగక పోతే అది ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుత కాలంలో రక్తనాళాలలో పూడికలు ఏర్పడి రక్త ప్రసరణ సాఫీగా జరగక హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నాయి. వీటి కారణంగా మరణించే వారి సంఖ్య అధికమవుతోంది. కనుక మనం రక్త నాళాలలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించే, రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ ఆహార పదార్థాలలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్త నాళాలలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఉపయోగపడతాయి. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా చేయడంలో ఎంతో సహాయపడతాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభించే చవకైన ఆహారం అవిసె గింజలు అని చెప్పవచ్చు. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా చేయడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, క్యాలరీలు, ప్రోటీన్స్, శరీరానికి మేలు చేసే కొవ్వులు అవిసె గింజలల్లో అధికంగా ఉంటాయి. రోజుకి 25 గ్రా. నుంచి 30 గ్రా. అవిసె గింజలను తినడం వల్ల హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
అవిసె గింజలలో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్, శరీరానికి మేలు చేసే కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొలెస్త్రాల్(హెచ్‌డీఎల్)ను పెంచి, చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి. గుండె జబ్బులు వచ్చి ఆపరేషన్స్ చేయించుకున్న వారు కూడా అవిసె గింజలను తినడం వల్ల మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
అవిసె గింజలు బీపీని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అవిసె గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్త నాళాలలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవడమే కాకుండా, భవిష్యత్తులో రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.