Soaked Peanuts : మనం ఆహారంగా తీసుకునే నూనె గింజల్లో పల్లీలు కూడా ఒకటి. భారతీయ వంటకాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. పల్లీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో, తక్షణ శక్తిని ఇవ్వడంలో పల్లీలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. పల్లీలను మనం వివిధ రకాలుగా తీసుకుంటూ ఉంటాం. కానీ మనలో చాలా మంది తెలియక చేస్తున్న పొరపాట్లల్లో ఒకటి పల్లీలపై పొట్టును తీసేసి తినడం.
చాలా మంది పల్లీలను పొట్టుతో కలిపి తింటే అవి రుచిగా ఉండవని వాటిపై ఉండే పొట్టును తీసేసి తింటూ ఉంటారు. కానీ అలా తినకూడదని పల్లీలను పొట్టుతో కలిపి తినడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు పల్లీలను ఎలా తీసుకోవాలి.. ఎలా తీసుకుంటే మన శరీరానికి మేలు కలుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలను ఆహారంలో భాగంగా తీసుకోవాలనుకునే వారు రోజూ రాత్రి గుప్పెడు పల్లీలను వాటిపై ఉండే పొట్టును తీయకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఆ పల్లీలు మనిగే వరకు నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.
ఇలా నానబెట్టిన పల్లీలను పొట్టుతో సహా ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి. ఇలా పల్లీలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరాకృతి కోసం అధికంగా వ్యాయామాలు చేసే వారు ఇలా నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పై పొట్టుతో సహా నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.
వీటిని తరచూ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటాం. అంతేకాకుండా పల్లీలను ఈ విధంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. మామూలు పల్లీలలో కంటే ఇలా పొట్టుతో సహా నానబెట్టిన పల్లీలకు విష పదార్థాలను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా పల్లీలను తీసుకోవడం వల్ల మనం బరువు త్వరగా తగ్గుతాము. అలాగే శరీరంలో వాపులను, మంటలను, నొప్పులను, దురదలను తగ్గించే గుణం కూడా ఈ పల్లీలకు ఉంటుంది.
ఇలా నానబెట్టిన పల్లీలను పొట్టుతో సహా రోజూ ఒక గుప్పెడు మోతాదులో తీసుకోవాలి. నానబెట్టిన వాటిని తినలేని వారు ఈ పల్లీలను కొద్దిగా ఉడికించుకుని తినవచ్చు. ఈ పల్లీలను ఎలా తీసుకున్నా కూడా పొట్టుతో సహా తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. పల్లీలపై ఉండే పొట్టులో కూడా అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పల్లీలను పొట్టుతో సహా తీసుకుంటేనే మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని వారు తెలియజేస్తున్నారు.