చంద్రగుప్త మౌర్యుడి దగ్గర పనిచేసిన గురువు చాణక్యుడి గురించి తెలియని వారుండరు. అతని గురించి అందరికీ తెలుసు. చాణుక్యుడికి ఉండే పట్టుదల, తెలివితేటలు అమోఘం. అతను మన జీవితానికి పనికొచ్చే అనేక సూత్రాలను చెప్పాడు. రాజనీతి శాస్త్రంలో చాణక్యుడు దిట్ట. అతని తెలివితేటలు, ఎత్తుగడలతో చంద్రగుప్త మౌర్యుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచాడు. భారతదేశాన్ని ఒకే రాజ్యంగా పరిపాలించిన చక్రవర్తిగా చంద్రగుప్త మౌర్యుడు పేరుగాంచాడు. అయితే అతని కుమారుడైన బిందుసారుడు ఎలా జన్మించాడో తెలుసా..? చంద్రగుప్తుడు అనేక మంది రాజులతో యుద్ధాలు చేసి గెలవడంతో అతనికి మహా చక్రవర్తి అనే పేరు వచ్చింది. అదే కోవలో అతన్ని చంపేందుకు కూడా శత్రువులు తయారయ్యారు. బయటి నుంచి వచ్చే శత్రువుల కన్నా రాజు కోటలో ఉంటూ రాజుకు వెన్నుపోటు పొడిచే వారే ఎక్కువగా ఉండేవారు.
ఈ విషయాన్ని పసిగట్టిన చాణుక్యుడు ఓ ఆలోచన చేశాడు. దాన్ని వెంటనే అమలులో పెట్టాడు. అదేమిటంటే… చాణుక్యుడు రోజూ కొద్ది మొత్తంలో విషాన్ని చంద్రగుప్తుడు తినే ఆహారంలో కలిపేవాడు. దీంతో విషం తిన్నా ఏమీ కాకుండా ఉంటుందని చాణక్యుడి ఆలోచన. అలా రోజూ చాణక్యుడు చేసే వాడు. ఈ విషయం చంద్రగుప్తునికి కూడా తెలియదు. అయితే చంద్రగుప్తుడు ఒక రోజు తనకు ఇచ్చిన విషం కలిపిన ఆహారాన్ని తన రాణి దుర్దకు తినిపిస్తాడు. దీంతో ఆ విష ప్రభావం వల్ల ఆమె మరణిస్తుంది. అయితే అప్పటికే ఆమె నిండు గర్భిణీ. దీంతో విషయం తెలుసుకున్న చాణక్యుడు హుటాహుటిన పరిగెత్తుకుని వచ్చి దుర్ద కడుపును చీల్చి అందులో ఉన్న బిడ్డను కాపాడుతాడు. అయితే అప్పటికే కొంత విషం బిడ్డ తలకు ఎక్కి నీలి రంగులో మచ్చ ఏర్పడుతుంది.
అయినా ఎలాగో ఆ శిశువును చాణక్యుడు కాపాడుతాడు. ఆ శిశువు పేరే బిందుసారుడు. అతను చంద్రగుప్తుడి కుమారుడు. మౌర్యుల వంశానికి రెండో రాజు. చంద్రగుప్తుడు చనిపోగానే బిందుసారుడు చక్రవర్తి అయి రాజ్యాన్ని పాలిస్తాడు. ఇదీ.. అతని కథ..!