భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది. అమ్మ తిడుతుందనో, నాన్న కొడతాడనో పిల్లలకు, స్కూల్‌లో టీచర్ కొడుతుందని స్టూడెంట్‌కు, సరిగ్గా పనిచేయకపోతే బాస్ తిడతాడని ఉద్యోగికి… ఇలా ఎవర్ని తీసుకున్నా అందరికీ భయం ఉంటుంది. అది ఏ విషయమైనా కావచ్చు. అయితే సాధారణంగా కొందరికి కామన్‌గా ఉండే భయాలు కొన్ని ఉంటాయి. వాటినే ఫోబియా అని అంటారు. బల్లిని చూస్తేనో, పాము అంటేనే, బొద్దింక మీడ పడితేనో, కత్తిని, రక్తాన్ని చూస్తేనో… ఇలా అన్నమాట. వీటిని ఫోబియాలు అంటారు. ఈ క్రమంలో మన ఇండియన్స్‌కు కామన్‌గా ఉండే ఇలాంటి కొన్ని ఫోబియాలు ఏమిటో తెలుసుకుందామా. మన దేశంలో చాలా మందికి ఉండే ఫోబియాల్లో విమాన ప్రయాణం కూడా ఒకటి. కొందరు విమానంలో ఎక్కాలంటేనే చాలా భయపడతారు. గాల్లో తమకు విమానంలో ఏదైనా జరుగుతుందనో, లేదంటే అది కూలిపోతుందనో వారు ఊహించుకుంటూ భయపడతారు. అలాంటి వారు విమానం దాదాపుగా ఎక్కరనే చెప్పవచ్చు.
చీకటి అన్నా కూడా మనలో చాలా మందికి భయమే. మగవారు ఏమో కానీ ఈ భయం ఆడవారికి ఎక్కువగా ఉంటుందట. పలు పరిశోధనలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. చీకట్లో భూతం, దెయ్యం ఉంటుందనే కారణం చేతనే చాలా మంది చీకటి అంటే భయపడతారట. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్తే అక్కడ డాక్టర్లు మందులు రాస్తారు. మరీ అనారోగ్యం ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్ కూడా వేస్తారు. అయితే చాలా మందికి ఇంజెక్షన్ అన్నా భయమేనట. ఇందుకు చిన్నారులే కాదు కొందరు పెద్దవారు కూడా భయపడతారట. వర్షాకాలంలోనే కాదు ఒక్కోసారి ఇతర కాలాల్లో వచ్చే వానలకు కూడా కొన్ని సార్లు ఉరుములు, మెరుపులు వస్తాయి. అయితే ఇవంటే కొందరికి అమితమైన భయమట.
చేతులు శుభ్రంగా లేకుండా ఉండి వాటితో భోజనం చేస్తే క్రిములు శరీరంలోకి వెళ్లి దాంతో అనేక రోగాలు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే కొందరు మాత్రం దీన్ని మరీ శూలశోధన చేస్తారట. చేతులు ఎన్ని సార్లు కడుక్కున్నా ఇంకా శుభ్రంగా లేవని, తమకు ఏదో అవుతుందని భయం చెందుతారట. దీన్నే ఓసీడీ వ్యాధి అని కూడా పిలుస్తారు. కొందరు ఇంట్లో బాగా అరుస్తుంటారు కానీ వారు బయటికి వస్తే మాట్లాడలేరు. భయపడతారు. కొందరిలో ఈ ఫోబియా ఇంకా ఎక్కువగా ఉంటుందట. వారు చిన్న మాట పబ్లిగ్గా మాట్లాడాలన్నా బాగా భయపడతారట. అస్సలు మాట్లాడలేరట.
మనిషై పుట్టాక మనం ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సమయంలో చనిపోవాల్సిందే. అందుకు ఎవరూ అతీతులు కారు. కానీ కొందరు మాత్రం తమకు ఎప్పుడో వచ్చే చావును దృష్టిలో ఉంచుకుని, దాని గురించే ఆలోచిస్తూ బాగా భయపడుతారట. అపార్ట్‌మెంట్లలో పైన ఉన్న అంతస్తులకు చేరుకోవాలంటే లిఫ్ట్‌లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు ఈ లిఫ్ట్‌లలో ఎక్కడానికి బాగా జంకుతారట. ఇంకా కొందరికైతే బాగా ఎత్తయిన ప్రదేశాలంటే భయమట. వాటిని ఎక్కాలంటే భయపడతారట. ఇక చివరిగా పాములు, బొద్దింకలు, కప్పలు, కుక్కలు… వీటి పట్ల భయపడేవారు కూడా ఉంటారు. అయితే టాప్ 10 ఫోబియాల్లో ఇవి ఆఖరు వరుసలో ఉంటాయి.