ప్రస్తుతం ఉన్న బందరు బస్సు ప్రాంగణం 42 సంవత్సరాల నాడు కట్టారు. అంతకుముందు కోనేరు సెంటర్ లో బస్సులు ఆగేవి. అప్పట్లో సిటీ బస్సులు ఓ వెలుగు వెలిగాయి. ఆర్టీసీ పుంజుకున్నాకా, ప్రయివేటు బస్సుల హవా తగ్గింది. కోనేరు సెంటర్ చూడటానికి పెద్ద సంతలా ఉండేది. ఈ కూడలి వృత్తాకారంలో ఉంటుంది. కొత్తగా వచ్చిన వారికి ఏ దారి ఎటు వెళ్తుందో చెప్పలేని అయోమయం.
ఇక సిటీ బస్సులు పెద్ద శబ్దం చేస్తూ వేగంగా ఈ కూడలికి వచ్చి, అంతే వేగంతో వెళ్లిపోయేవి. అక్కడ ఏ ఊరి బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియదు. ముందు వాహనం త్వరగా వెళ్లకపోతే, వెనకున్న వాళ్ళు, చెవులు బద్దలయ్యేలా హారన్ మోగించేవారు. దీనికితోడు జేబుదొంగల హస్తలాఘవం. బస్సులు ఎక్కేచోట సరైన నీడలేక ఎండలో, వానలో అష్టకష్టాలు పడేవారు. దీనికి బోనస్ గా దుమ్ము. వాన వస్తే కోనేరు సెంటరులో నాలుగు అడుగుల లోతున నీరు నిలిచేది. వర్షం వస్తే కొనేరే!
ఈ ఇబ్బందులు తట్టుకోలేక పిల్లల రొద. చిరుతిళ్ళు అమ్మేవారి వింత స్వరాలు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో బందరు బస్టాండ్ లో కొన్ని నిముషాలు నించోవాలంటే తలపోటు ఖాయం. అందుచేత ఒకప్పుడు బతుకు బందరు బస్ స్టాండు అనే సామెత వ్యాప్తి చెందింది.