Thulasi Chettu : మనం పూజించే చెట్లలో తులసి చెట్టు కూడా ఒకటి. హిందూ సంప్రదాయంలో తులసి చెట్టును పూజించినట్టు ఏ ఇతర చెట్టునూ పూజించరు. తులసి చెట్టుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతేకాకుండా తులసి చెట్టును ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ తులసి చెట్టును పూజించడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని ఎటువంటి కష్ట నష్టాలు ఉండవని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా మనం ప్రతిరోజూ పూజ చేసే తులసి చెట్టు వాడిపోయినా, ఎండిపోయినా ఏదో ఒక రూపంలో చెడు జరగబోతుందని చాలా మంది భావిస్తారు. చాలా మంది ఒక చిన్న కుండీలో తులసి చెట్టును ఉంచి నీరు పోస్తూ ఉంటారు. కొద్దికాలం తరువాత ఆ మట్టిలో ఉన్న పోషకాలు అన్నీ అయిపోతాయి. ఇలా పోషకాలు అందక కూడా తులసి చెట్టు వాడిపోవడం, ఎండిపోవడం జరుగుతుంది. దీనిని కూడా చాలా మంది ప్రమాదంగా భావిస్తారు.
ఏ మొక్కకైనా మనం తగినన్ని పోషకాలను అందిస్తే ఆ మొక్క వాగడిపోకుండా ఉంటుంది. అదే విధంగా మనం పూజించే తులసి చెట్టుకు కూడా తగినన్ని పోషకాలను అందిస్తే అది వాడిపోకుండా, ఎండిపోకుండా ఉంటుంది. తులసి చెట్టే కాకుండా ఇతర చెట్లకు కూడా బయట నుండి పోషకాలను ఎలా అందించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం కడిగిన నీటిని పార బోయకుండా ఆ నీటిని చెట్లకు పోయడం వల్ల చెట్లకు ఎంతో బలం చేకూరుతుంది. అలాగే అన్నం వండేటప్పుడు వార్చిన గంజిని కూడా చెట్లకు పోయవచ్చు. అదే విధంగా పప్పును కడిగిన నీటిని మొక్కలకు పోయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఆవు పేడను, ఆవు మూత్రాన్ని మొక్కలకు వేయడం వల్ల కనీసం రెండు నెలల వరకు మొక్కలకు ఎటువంటి పోషకాలను ఇవ్వవలసిన అవసరం ఉండదు. అదే విధంగా పండ్లను, కూరగాయలను కోసినప్పుడు వచ్చిన పొట్టును ముక్కలుగా చేసి చెట్ల మొదళ్లలో వేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకు అనేక పోషకాలు అందుతాయి. మొక్క మొదలు చుట్టూ నెలకొక్కసారైనా శుభ్రం చేస్తూ ఉండాలి. ఆ మొక్క మొదల్లో ఉన్న మట్టిని పైకి కిందికి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొక్క వేర్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అలాగే తులసి చెట్టుకు ఉండే పండిన ఆకులను ఎప్పటికప్పుడూ తొలగిస్తూ ఉండాలి. తులసి మొక్క మొదల్లో ఎటువంటి ఆకులు లేకుండా చూసుకోవాలి. తులసి మొక్క కొమ్మ వాడిపోయినప్పుడు దానిని వెంటనే మొక్క నుండి వేరు చేయాలి. ఈ విధంగా చేస్తే తులసి మొక్కలే కాదు.. ఇతర మొక్కలు కూడా వాడిపోకుండా , ఎండిపోకుండా ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతాయి.