Pumpkin Plant : పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఉండే చెట్లల్లో గుమ్మడి చెట్టు కూడా ఒకటి. దీనిని ఎక్కువగా ఇంటి వెనుక ఖాళీ ప్రదేశంలో, వరిగడ్డి వాములపైన, కంచెలకు అల్లించి పెంచే వారు. పూర్వకాలంలో గుమ్మడికాయలు సమృద్ధిగా దొరికేవి. ప్రస్తుత కాలంలో వీటిని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గుమ్మడికాయలతో మనం వడియాలను, అప్పడాలను, పాయసాన్ని, కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా గుమ్మడి కాయ మనకు ఉపయోగపడుతుంది. గుమ్మడికాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి.. దానిలో ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయను సంస్కృతంలో కూష్మాండ అని అంటారు. బాగా పండిన గుమ్మడి కాయ ఎక్కువ రుచిగా మధురంగా ఉంటుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి బలం, మేహశాంతి కలుగుతాయి. మల మూత్రాలు సాఫీగా వచ్చేలా చేయడంలో గుమ్మడికాయ ఉపయోగపడుతుంది. గుమ్మడికాయ పైత్య రోగాలను, దాహాన్ని, తాపాన్ని, కడుపు ఉబ్బరాన్ని కూడా హరిస్తుంది. దీనిని ఎక్కువగా తినకూడదు. గుమ్మడికాయను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో రక్తం పాడవుతుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల తలెత్తే సమస్యలకు శొంఠి విరుగుడుగా పని చేస్తుంది.
లేత గుమ్మడికాయను ఆహారంగా తీసుకోకూడదు. లేత గుమ్మడికాయ వాతాన్ని, రక్త పైత్యాన్ని కలుగజేస్తుంది. బలహీన శరీరం ఉన్న వారు, వ్యాధి గ్రస్తులు గుమ్మడికాయను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి పూలతో కూరను వండుకుని తినడం వల్ల పైత్యం తగ్గుతుంది. శరీరానికి చలువ కూడా చేస్తుంది. గుమ్మడికాయ లేత ఆకులను కూరగా వండుకుని తినడం వల్ల కడుపులోని దోషాలన్నీ తొలగిపోతాయి. గుమ్మడి పండు తొనలను నీటితో అరగదీసి ఆ గంధాన్ని లేపనంగా రాయడం వల్ల జెర్రి విషం హరించుకుపోతుంది. గుమ్మడి తీగను ఎండించి కాల్చి బూడిదగా చేయాలి. ఈ బూడిదను నిల్వ చేసుకుని రోజుకు రెండు పూటలా రెండు గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల మూత్రం ధారాళంగా వస్తుంది.
లేత గుమ్మడి ఆకులను ఏడింటిని తీసుకుని వరుసగా ఒక దాని మీద ఒకటి ఉంచి కట్టుకట్టడం వల్ల గోరు చుట్టు సమస్య తగ్గుతుంది. బూడిద గుమ్మడి గింజలను ఎక్కువ మొత్తంలో సేకరించి వాటి నుండి తైలాన్ని తీయాలి. ఈ తైలాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో లోపలికి తీసుకుని మరికొద్దిగా తైలాన్ని తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో కాలంగా నిద్రలేమితో బాధపడుతున్న వారు కూడా హాయిగా నిద్రపోతారు. బూడిద గుమ్మడి కాయ పై పొట్టును తీసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను నేతిలో ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఈ ముక్కలకు సమానంగా మరో గిన్నెలో పటిక బెల్లాన్ని తీసుకుని పాకం వచ్చే వరకు మరిగించాలి. ఈ పాకాన్ని ముందుగా వేయించిన గుమ్మడికాయ ముక్కలను వేసి కలిపి నిల్వ చేసుకోవాలి. వీటిని రోజూ రెండు పూటలా 3 నుండి 4 ముక్కలను తినడం వల్ల అపస్మారకం తగ్గుతుంది.
బాగా పండిన గుమ్మడి పండును ముక్కలుగా కోసి ఎండబెట్టాలి. ఈ ముక్కలను ఇత్తడి పాత్రలో వేసి మూత పెట్టి బొగ్గుగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఆ ముక్కలను మెత్తగా నూరి జల్లించాలి. ఈ పొడికి సమానంగా శొంఠి పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ రెండు పూటలా పూటకు రెండు గ్రాముల మోతాదులో చల్లని నీటితో కలిపి తాగడం వల్ల పొట్టలోని శూల నొప్పులు తగ్గిపోతాయి. బూడిద గుమ్మడి గింజలను, దోస గింజలను సమపాళ్లలో తీసుకుని నీటితో మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పొత్తికడుపుపై పట్టులా వేయడం వల్ల మూత్ర ధారాళంగా వస్తుంది. బాగా పండిన బూడిద గుమ్మడికాయ లోపలి గుజ్జును దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 100 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 50 గ్రాముల పటిక బెల్లాన్ని కలిపి తాగించడం వల్ల కూడా మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
బూడిద గుమ్మడి కాయ రసం 100 గ్రాములు, రావి చెట్టు జిగురు 50 గ్రాముల మోతాదులో తీసుకుని జిగురు పోయే వరకు వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల క్షయతోపాటు రక్త క్షయ కూడా తగ్గుతుంది. పండిన బూడిద గుమ్మడి రసం 100 గ్రాములు, పచ్చి పాలు 100 గ్రాముల తీసుకుని ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే అధిక రక్తస్రావం సమస్య తగ్గుతుంది.
బాగా పండిన బూడిద గుమ్మడికాయ రసాన్ని ఒక కప్పు మోతాదులో తీసుకుని దానికి పసుపును, 5 గ్రాముల తవుడును కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల అతిమూత్రం సమస్య తగ్గుతుంది. ఈ విధంగా గుమ్మడికాయ, బూడిద గుమ్మడి కాయలు మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.