Hibiscus Plant : మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటుంది. అయితే చాలా మందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా.. అనే సందేహం కలుగుతుంటుంది. మందార మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా, పెంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందట. దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులని ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరి చందనం, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందారం. ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదట.

ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచడం ఎంతో శుభప్రదం. బయటకు వెళ్లేటప్పుడు ఎర్ర మందారం మొక్కను చూస్తూ బయటకు వెళ్లడం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది. మానసికి పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంతా శుభమే కలుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో సింహ ద్వారానికి కుడి వైపు ఉండేలా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పువ్వులతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మందార పువ్వు రెక్కలను ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. మందార పువ్వుల పేస్ట్ తో ముఖం పై ఉండే మొటిమలను, మచ్చలను తగ్గించుకోవచ్చు. ఎనిమిది మందార పువ్వులను, ఎనిమిది మందార ఆకులను తీసుకుని శుభ్రం చేసి మెత్తగా దంచాలి. ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేసి అందులో మందార పువ్వుల, ఆకులను మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఈ నూనె చల్లారిన తరువాత రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, జుట్టు నెరవడం వంటి సమస్యలు తగ్గుతాయి.
గుప్పెడు మందార ఆకులను తీసుకుని పేస్ట్ లా చేసి అందులో నాలుగు టీ స్పూన్ల పెరుగును కలిపి తలకు బాగా పట్టించి రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ మొక్కతో మనం ఇంట్లోనే షాంపును తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నీళ్లను పోసి అందులో గుప్పెడు మందార ఆకులను, ఆరు మందార పువ్వులను వేసి మరిగించాలి. నీళ్లు చల్లారిన తరువాత మందార పువ్వులను, ఆకులను తీసి మెత్తగా చేసి దానికి శనగ పిండిని కలిపి షాంపూలా వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి.
మందార పువ్వులు వేసి వేడి చేసిన కొబ్బరి నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మందార పువ్వులతో చేసిన కషాయాన్ని కానీ, టీ ని కానీ తాగితే గుండె జబ్బులు, మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. హైబీపీ బారిన పడకుండా ఉంటాం. కాలేయం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మందార పువ్వులను నేతిలో వేయించుకుని తింటే విరేచనాలు తగ్గుతాయి. ఈ విధంగా మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు.