Pomegranate Leaves : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. దానిమ్మ పండ్లు తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది నేరుగా తినడంతో పాటు జ్యూస్ గా చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మ పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే దానిమ్మ గింజలతో పాటు దానిమ్మ చెట్టు ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దానిమ్మ ఆకులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా వర్షాకాలంలో ఈ టీ ని తప్పకుండా తాగాలని వారు చెబుతున్నారు. దానిమ్మ ఆకులతో టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ టీ ని తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దానిమ్మ ఆకుల టీ ని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో శుభ్రం చేసిన 6 లేదా 7 దానిమ్మ ఆకులు వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి.
అలాగే ఈ టీ ని రోజుకు రెండు పూటలా తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. అదే విధంగా దానిమ్మ ఆకుల టీని తాగడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు దానిమ్మ ఆకుల టీని తాగడం వల్ల సమస్య దూరమయ్యి చక్కగా నిద్రపడుతుంది. అలాగే నోటిపూత, నోటి సమస్యలతో బాధపడే వారు దానిమ్మ ఆకుల టీని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా చేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది. నోట్లో ఉండే క్రిములు, బ్యాక్టీరియా నశించి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
అలాగే ఈ ఆకులను పేస్ట్ గా చేసి చర్మపై రాసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ ఆకులను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ మూడు గ్రాముల మోతాదులో వేడి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి. కాలేయం మరిము మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే విధంగా ఈ ఆకుల రసాన్ని రోజూ రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఈ విధంగా దానిమ్మ కాయలతో పాటు దానిమ్మ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటితో చేసిన టీ ని వర్షాకాలంలో తీసుకోవడం వల్ల మనకు మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.