Lungs Health : పనికి రాని మొక్క అంటూ ఈ భూమి మీద ఉండనే ఉండదు. ఆ మొక్క వల్ల కలిగే ఉపయోగాలు తెలియక, దానిని ఉపయోగించే విధానం తెలియక వాటిని మనం కలుపు మొక్కలుగా, పిచ్చి ముక్కలుగా భావిస్తూ ఉంటాం. ఇలా మనం పిచ్చి మొక్కగా భావించే మొక్కలల్లో తలంబ్రాల మొక్క ఒకటి. ఈ మొక్క ఎక్కువగా రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద, చేను కంచె వెంబడి పెరుగుతూ ఉంటుంది. దీనిని అత్తాకోడల మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా పొదలు పొదలుగా పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్కను ఎక్కువగా పంటపొలాల చుట్టూ పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్కలు ఉండడం వల్ల పంటలకు చీడపీడలు పట్టకుండా ఉంటాయి. దీనిలో 150 కు పైగా జాతులు ఉంటాయి.
వివిధ రకాల ఫర్నిచర్ ను తయారు చేయడానికి కూడా ఈ తలంబ్రాల మొక్కను ఉపయోగిస్తారు. ఈ మొక్కలో ఎన్నో ఔష|ధ గుణాలు దాగి ఉన్నాయి. తలంబ్రాల మొక్క పూలు, ఆకులు, వేర్లు అన్ని కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. తలంబ్రాల మొక్కను ఉపయోగించి చర్మ సంబంధిత సమస్యలను, ఉబ్బసాన్ని, నోటిపూతను తగ్గించుకోవచ్చు. ఈ మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. గాయాలను నయం చేయడంలో కూడా ఈ మొక్క మనకు ఉపయోగపడుతుంది. దీని ఆకులను పేస్ట్ గా చేసి గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఆకులను నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటి నుండి వచ్చే ఆవిరిని పీల్చాలి.

ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తగ్గు ముఖం పడతాయి. తలంబ్రాల మొక్కకు విష ప్రభావాన్ని తగ్గించే శక్తి కూడా ఉంది. పాము కాటుకు గురైనప్పుడు, విష కీటకాలు కుట్టినప్పుడు ఆ మొక్క ఆకుల రసాన్ని కుట్టిన చోట వేయడం వల్ల విష ప్రభావం కొంతమేర తగ్గుతుంది. వివిధ రకాల కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఈ మొక్క ఆకుల రసాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను కొద్దిగా వేడి చేసి కీళ్ల నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే తలంబ్రాల మొక్క ఆకులను పేస్ట్ గా చేసి కీళ్ల నొప్పులపై రాసి కట్టు కట్టాలి.
ఇలా నెల రోజుల పాటు చేయడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క ఎండిన ఆకులతో ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండే దోమలు బయటకు పోతాయి. ఈ మొక్క పువ్వులను కూడా క్షయ వ్యాధి తగ్గించే సంప్రదాయ ఔషధాల్లో ఉపయోగిస్తారు. తలంబ్రాల మొక్క మనకు ఎన్నో రకాల ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం పలు రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.