Giloy : ఔషధ గుణాలు కలిగిన తీగ జాతికి చెందిన మొక్కలలో తిప్ప తీగ కూడా ఒకటి. పూర్వకాలం నుండి ఈ తిప్ప తీగ మొక్కను ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. మనకు వచ్చే అనేక రోగాలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు మార్కెట్ లో తిప్ప తీగ కషాయం, చూర్ణం, క్యాప్సూల్స్ కూడా లభిస్తున్నాయి. ఈ మొక్క కంచెలకు, ఇతర చెట్లకు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. తిప్పతీగను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలవు. శరీరంలో ఉండే కణాలు దెబ్బతినకుండా చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే గుణం కూడా తిప్పతీగకు ఉంది. తిప్ప తీగ పొడిని బెల్లంలో కలిపి తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగుపడి అజీర్తి సమస్య తగ్గుతుంది. మనల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులల్లో ఒకటి అయిన మధుమేహాన్ని నివారించడంలో కూడా తిప్పతీగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకు గాను తిప్పతీగ రసం లేదా క్యాప్సూల్స్ లేదా పొడిని రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. రసం అయితే పావు టీస్పూన్, క్యాప్సూల్ అయితే ఒకటి, పొడి అయితే చిటికెడు మోతాదులో తీసుకోవాలి. గోరు వెచ్చని నీటితో వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. తిప్ప తీగ యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కనుక ఆర్థరైటిస్ వంటి వ్యాధులను, కీళ్ల నొప్పులను, వాపులను నయం చేయడంలో కూడా తిప్ప తీగ దోహదపడుతుంది.
గోరు వెచ్చని పాలలో తిప్పతీగ పొడిని కలిపి తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మనకు వచ్చే దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాస సంబంధమైన సమస్యలను సయంచేయడంలో కూడా తిప్ప తీగ సహాయపడుతుంది. ముఖంపై వచ్చే మచ్చలను, మొటిమలను, ముడతలను నివారించ గల శక్తి కూడా తిప్పతీగకు ఉంది. అంతేకాకుండా వృద్ధాప్యఛాయలను కూడా తిప్పతీగ తగ్గించగలదు. ఈ విధంగా తిప్పతీగను ఉపయోగించి మనకు వచ్చే అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి దీనిని గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉపయోగించరాదని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.