Ghee : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని తమ దైనందిన జీవితంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి ఏదైనా సరే మన నిత్య జీవితంలో భాగం అయ్యాయి. ఆయుర్వేదంలోనూ నెయ్యికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. నెయ్యితో మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నెయ్యి లేకుండా కొందరు భోజనం తినరు అంటే అతిశయోక్తి కాదు. నెయ్యి వల్ల ఆహారాల రుచి పెరుగుతుంది. నెయ్యిలో విటమిన్లు ఎ, డి, ఇ, కె ఉంటాయి. అలాగే అనేక రకాల మినరల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
నెయ్యిలో ఉండే కొవ్వులు మన శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. దీంతో మన శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అయితే నెయ్యిలో ఉండే కొవ్వుల కారణంగా చాలా మంది దీన్ని తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. ఇక అధిక బరువు తగ్గాలనుకునేవారు నెయ్యి జోలికే పోరు. అయితే అసలు బరువు తగ్గాలనుకునే వారు నెయ్యి తినవచ్చా.. నెయ్యిని తింటే బరువు పెరుగుతారా.. అన్న ప్రశ్నలకు వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునే వారు లేదా ఎవరైనా సరే నెయ్యి తినవచ్చు. కానీ ఒక టీస్పూన్ వరకే తినాలి. ఎక్కువగా తినకూడదు. బరువు ఎక్కువగా ఉన్నవారు లేదా బరువు తగ్గాలని అనుకునే వారు ఉదయం నెయ్యిని తినకూడదు. మధ్యాహ్నం భోజనంలో 1 టీస్పూన్ వేసి తినవచ్చు. నెయ్యి తినడం వల్ల లాభాలే కలుగుతాయి తప్ప నష్టాలు ఉండవు. అందువల్ల నెయ్యిని రోజూ మోతాదులో తినవచ్చని వైద్యులు చెబుతున్నారు.