భారతీయ సంస్కృతిలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని ఇండియన్ సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. నెయ్యి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నెయ్యిని తింటే అధికంగా బరువు పెరుగుతామని, శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుందని కొందరు భయపడుతుంటారు. దీంతో నెయ్యికి కొందరు దూరంగా ఉంటారు. కానీ రోజూ సరైన మోతాదులో నెయ్యిని తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యిని రోజూ తగిన మోతాదులో తీసుకుంటే బరువు పెరగరని, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరగవని అంటున్నారు. నెయ్యిని హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు కూడా నిర్భయంగా తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన మోతాదులో నెయ్యిని తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని, మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుందని, బరువు తగ్గుతారని చెబుతున్నారు.
అయితే నెయ్యి వల్ల కలిగే లాభాలు సరే. ఆరోగ్యకరమైన మోతాదు అంటే ఎంత ? ఎంత మోతాదులో నెయ్యిని రోజూ తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు ? అంటే..
సాధారణంగా కొందరు నెయ్యితో వంటలు చేస్తుంటారు. అలాంటి స్థితిలో ప్రత్యేకంగా నేరుగా నెయ్యిని తీసుకోవాల్సిన పనిలేదు. ఎలాగూ వంటల్లో నెయ్యిని ఎక్కువ మోతాదులోనే వేస్తారు కనుక నేరుగా తీసుకోవాల్సిన పనిలేదు. ఇక వంటల్లో నెయ్యి వేయని వారు నెయ్యిని నేరుగా తీసుకోవచ్చు.
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 1 టీస్పూన్ నెయ్యిని తీసుకోవచ్చు. అంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనాల సమయంలో ఒక్కో టీస్పూన్ చొప్పున నెయ్యిని తీసుకోవచ్చన్నమాట. ఇది తగిన మోతాదు. ఇంతకన్నా మించి నెయ్యిని తీసుకోరాదు. ఇక పీసీవోఎస్, గుండె జబ్బులు, హైబీపీ, మలబద్దకం, కీళ్ల నొప్పులు, వాపులు, ఇన్‌ఫ్లామేటరీ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉన్నవారు కూడా ఇదే మోతాదులో నెయ్యిని వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కలగవు.
రాత్రి భోజనంతో ఒక టీస్పూన్ నెయ్యిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య ఉండదు. అజీర్ణం సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో నిద్ర బాగా పడుతుంది.
కాబట్టి రోజుకు 3 టీస్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అదే శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, వ్యాయామం బాగా చేసేవారు రోజుకు 6 టీస్పూన్ల నెయ్యిని తీసుకోవచ్చు. అయితే ఆవు నెయ్యి శ్రేష్టమైంది. అది కూడా ఇంట్లో తయారు చేసింది అయితే మేలు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365