Sprouts : సాధారణంగా శరీరంలో ఉండే కొవ్వు కరిగి బరువు తగ్గాలి అనుకునే వారు తక్కువగా క్యాలరీలు, ఎక్కువగా పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతోపాటు బరువు కూడా తగ్గుతారు. అధికంగా బరువు ఉండే వారిలో పోషకాల లోపం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించి, బరువు తగ్గేలా చేసే ఆహార పదార్థాలలో మొలకెత్తిన విత్తనాలు ఒకటి. మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి.
మనలో చాలా మంది మొలకలను ఆహారంలో భాగంగా కూడా తీసుకుంటున్నారు. అయితే కొందరికి మొలకెత్తిన విత్తనాలను తయారు చేసుకోడానికి ఏయే గింజలను వాడాలి, ఎంత పరిమాణంలో తినాలి , వాటిని వాసన, జిగురు లేకుండా ఎలా తయారు చేసుకోవాలి.. లాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. మనం పెసలు, బొబ్బెర్లు, శనగలు, ఉలవలు, రాగులు, సజ్జలు, గోధుమలు, జొన్నలతో మొలకెత్తిన విత్తనాలను తయారు చేసుకోవచ్చు. ఈ గింజలతో చేసిన 100గ్రా. మొలకెత్తిన విత్తనాలను తీసుకున్నప్పుడు 328 క్యాలరీల నుండి 378 క్యాలరీల శక్తి లభిస్తుంది.
కానీ ఈ గింజలల్లో కొన్ని మొలకెత్తిన విత్తనాలుగా చేసినప్పుడు గట్టిగా, జిగురుగా అవుతాయి. వీటి గట్టితనం, వాసన, జిగురుతనం, రుచిల కారణంగా వీటిని తినలేరు. ఈ గింజలలో పెసలు, శనగలు, బొబ్బెర్లు మాత్రమే మనం తినడానికి ఎక్కువ వీలుగా ఉంటాయి. ఈ మూడు రకాల గింజల నుండి ఒక్కో రకం గింజలు 30 గ్రా. నుండి 35 గ్రా.ల పరిమాణంలో మొత్తం 100 గ్రా. ల పరిమాణం అయ్యేలా తీసుకోవాలి. ఈ గింజలను వేరు వేరు గిన్నెలలో తీసుకుని సరిపడా నీటిని పోసుకుని 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తరువాత ఈ గింజలను 5 నుంచి 6 సార్లు బాగా కటిగి నీటిని పారబోయాలి. ఇలా కడిగిన గింజలను శుభ్రమైన వస్త్రం పై కానీ, ప్లేటు మీద కానీ వేసి ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గింజలు వాసన, జిగురు రాకుండా ఉంటాయి.
ఇలా ఆరబెట్టుకున్న గింజలను ఒక మందపాటి వస్త్రంలో వేసి మూట కట్టి కదలించకుండా పెట్టాలి. ఈ మూటను ఒకటిన్నర రోజు తరువాత విప్పాలి. ఇలాచేయడం వల్ల ఈ గింజల నుండి రెండు లేదా రెండున్నర అంగుళాల పొడవు మొలకలు వస్తాయి. గింజల నుండి మొలకలు పొడుగ్గా రావడం వల్ల వీటిలో పోషకాల విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇలా వచ్చిన మొలకలను వస్త్రం నుంచి నెమ్మదిగా వేరు చేసి గిన్నెలో తీసుకోవాలి. మొకలను తయారు చేసుకోడానికి స్ప్రౌట్ మేకర్స్, చిల్లులు ఉన్న బాక్సులు కూడా మార్కెట్ లో దొరుకుతాయి. ఇలా తయారు చేసుకున్న మొలకెత్తిన విత్తనాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా.. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.