Pani Puri On Weight Loss Diet : మనలో చాలా మంది అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల డైటింగ్ పద్దతులను పాటిస్తూ ఉంటారు. అలాగే జంక్ ఫుడ్ తో పాటు ఇష్టమైన ఆహారాలను తినడం మానేస్తూ ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు, డైటింగ్ పద్దతులు పాటించే వారు తినడం మానేసే ఇష్టమైన ఆహారాల్లో పానీపూరీ కూడా ఒకటి. బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో చాలా మంది దీనిని తినడం మానేస్తూ ఉంటారు. మనం ఆహారంగా తీసుకునే చిరుతిళ్లల్లో ఇది కూడా ఒకటి. పానీపూరీ మనకు సాయంత్రం సమయాల్లో రోడ్ల పక్కన ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు.
మనకు తీపి, కారం, పులుపు రుచుల్లో ఇది లభిస్తూ ఉంటుంది. పానీపూరీని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. రుచిగా ఉన్నప్పటికి, తినాలని కోరిక ఉన్నప్పటికి డైటింగ్ చేసే వారు చాలా మంది పానీపూరీని తినడం మానేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు, డైటింగ్ చేసే వారు పానీపూరీని పూర్తిగా తినడం మానేసే అవసరం లేదని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పానీపూరీని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక పానీపూరీ 36 క్యాలరీలను కలిగి ఉంటుంది. ఒక ప్లేట్ పానీపూరీ 216 క్యాలరీలను కలిగి ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు తీసుకోవాల్సిన క్యాలరీలకు అనుగుణంగా పానీపూరీని తీసుకోవాలి. అలగే పానీపూరీని భోజనం చేసిన తరువాత తీసుకోకూడదు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా మాత్రమే తీసుకోవాలి.
వీలైనంత వరకు సాయంత్రం 6 గంటల లోపే తీసుకోవాలి. అలాగే వీలైనంత వరకు గోధుమపిండి, రవ్వతో చేసిన పానీపూరీలను మాత్రమే తీసుకోవాలి. మైదాపిండితో చేసిన పూరీలను తీసుకోకూడదు. అదే విధంగా పానీపూరీలోకి వాడే కూరను తయారు చేయడానికి బంగాళాదుంపలు, శనగలను వాడుతూ ఉంటారు. బంగాళాదుంపల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బంగాళాదుంపను వాడకపోవడమే మంచిది. అలాగే పానీపూరీలో నీటిని తయారు చేయడానికి పుదీనా, జీలకర్ర, ఇంగువ, ఎండిన అల్లం పొడి, సోంపు గింజలు వంటి వాటిని ఉపయోగించాలి. ఇవి రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
వీటితో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే మనకు బయట పూరీ బిళ్లలు లభిస్తూ ఉంటాయి. వీటిని తీసుకు వచ్చి నూనెలో వేయించడానికి బదులుగా ఒవెన్ లో ఉంచి కూడా ఈ పూరీలను క్రిస్పీగా చేసుకోవచ్చు. ఒవెన్ లో 2 నిమిషాల పాటు ఉంచడం వల్ల నూనె వాడే అవసరం లేకుండా పూరీలు చక్కగా పొంగుతాయి. దీంతో క్యాలరీలు మరింతగా తగ్గుతాయి. అలాగే ఈ పానీపూరీని వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి. బయట లభించే పానీపూరీలను తినకపోవడమే మంచిది. ఈ విధంగా డైటింగ్ చేసే వారు శరీరానికి కావల్సిన ప్రోటీన్స్, క్యాలరీలను బట్టి పానీపూరీని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.