Fish : మన చుట్టూ ఉన్న సమాజంలో రకరకాల ఆహారాలను తినేవారు ఉంటారు. మాంసాహారం తినేవారు ఒకెత్తయితే.. కేవలం శాకాహారం మాత్రమే తినేవారు ఒకెత్తు. ఇక మాంసాహారుల్లోనూ చేపలు తినేవారు కూడా అధికంగానే ఉంటారు. చేపల్లో రకరకాల వెరైటీలు లభిస్తాయి. ఒక్కో చేప వెరైటీ భిన్న రుచిని కలిగి ఉంటుంది. కనుక ఎవరికి వారు తమ స్థోమత, ఇష్టాలకు తగినట్లుగా చేపలను కొని తెచ్చి తింటుంటారు. అయితే చేపల్లో సముద్రపు చేపలు మంచివా.. లేక మంచి నీటి చేపలు మంచివా..? రెండింటిలో వేటిని తింటే అధికంగా లాభాలు కలుగుతాయి ? అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. మరి దీనికి న్యూట్రిషనిస్టులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే..
మనకు రెండు రకాల చేపలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి మంచి నీటి చేపలు. అంటే ఇవి నదులు, సరస్సులు, చెరువుల్లో లభించేవి. రెండోది సముద్రపు చేపలు. ఇవి కేవలం సముద్రాల్లోనే లభిస్తాయన్నమాట. అయితే ఈ రెండు రకాల చేపలను మనం తినవచ్చు. ఇవి రెండూ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించేవే. కానీ సముద్రపు చేపల కన్నా.. మంచి నీటి చేపల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక పోషకాల పరంగా చూసుకుంటే మంచి నీటి చేపలే పై స్థానంలో నిలుస్తాయని చెప్పవచ్చు.
మంచి నీటి చేపల్లో కాల్షియంతోపాటు మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అనే మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, ఫోలేట్ కూడా మంచి నీటి చేపల్లోనే అధికంగా ఉంటాయి. కనుక సముద్రపు చేపల కన్నా మంచి నీటి చేపలను తింటేనే మనకు పోషకాలు.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కాస్త ఎక్కువగా లభిస్తాయని చెప్పవచ్చు. అయితే సముద్రపు చేపలు కూడా ఆరోగ్యకరమైనవే. అలా అని చెప్పి వీటిని తినడం మానేయాల్సిన పనిలేదు. మనకు అందుబాటులో ఏ రకమైన చేపలు ఉంటే వాటినే తినాలి. ఇక మంచి నీటి చేపలు కూడా కాలుష్యం లేని నదులు, చెరువుల్లో పెరిగినవి అయితే మేలు. లేదంటే చేపల్లో పాదరసం శాతం అధికంగా ఉంటుంది. ఇది మనకు మంచిది కాదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక చేపలను చూసి కొనుక్కోవడం మేలు. అలాంటి చేపలను తింటేనే మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పోషకాలు లభిస్తాయి..!