Jowar Pongal : చిరు ధాన్యాలలో ఒకటైన జొన్నలు మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని సంగటి, జావ, రొట్టె రూపంలో తయారు చేసి తింటుంటారు. అయితే ఇవి కొందరికి అంతగా రుచించవు. కానీ జొన్నలతో పొంగల్ తయారు చేసుకుంటే.. అది ఎంతో మందికి నచ్చుతుంది. దీంతో రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయి. ఇక జొన్నలతో పొంగల్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్నలతో పొంగల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నలు (దంచినవి లేదా రవ్వ) – ఒక కప్పు, బెల్లం – ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీస్పూన్, జీడిపప్పు – 6, కిస్మిస్ – 6, నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు.
జొన్నలతో పొంగల్ తయారు చేసే విధానం..
కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లను వేసి వాటిని దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. కడాయిలో రెండున్నర కప్పుల నీళ్లను పోసి వేడి అయిన తరువాత రవ్వను వేసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి. ఆ తరువాత బెల్లం వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికిన తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి జీడిపప్పు, కిస్మిస్ లతో అలంకరించుకోవాలి. దీంతో వేడి వేడి జొన్నల పొంగల్ తయారవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా మీద కాస్త నెయ్యి చల్లి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమేకాదు.. మనకు పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి.