Alcohol Effect on Brain : చాలా మంది ఎప్పుడో ఒకసారి లేదా వారానికి ఒకసారి మద్యం సేవిస్తుంటారు. కొందరు రోజూ మద్యం సేవిస్తారు.. కానీ పరిమిత మోతాదులో తీసుకుంటారు. ఇక కొందరు రోజూ విపరీతంగా మద్యం సేవిస్తుంటారు. అయితే పరిమిత మోతాదులో మద్యం తీసుకుంటే ఏమీ కాదు.. కానీ మద్యం మోతాదు మించి అధికంగా సేవిస్తే మాత్రం.. అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా మెదడు నాశనం అవుతుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్‌లో సైంటిస్టులు తమ అధ్యయనం తాలూకు వివరాలను వెల్లడించారు.
సైంటిస్టులు మొత్తం 36వేల మంది నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. మద్యం పరిమిత మోతాదులో తాగే వారితోపాటు అధిక మొత్తంలో తాగేవారు, వారికి ఉన్న అలవాట్లు, వయస్సు, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు.. తదితర అన్ని వివరాలను సేకరించి వాటిని అధ్యయనం చేశారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే.. మద్యం అధికంగా తాగేవారిలో మెదడు సైజ్ తగ్గిందని.. మెదడు కణాలు దెబ్బతిన్నాయని గుర్తించారు. కనుక అధికంగా మద్యం సేవించవద్దని.. మెదడుపై మద్యం తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.
అయితే పరిమిత మోతాదులో మద్యం సేవించడం వల్ల అనర్థాలు ఎక్కువగా జరగవని.. విపరీతంగా మద్యం సేవిస్తేనే ఇలాంటి దుష్పరిణామాలు కలుగుతాయని అంటున్నారు. మద్యం అధికంగా సేవించే వారిలో మెదడుకు సంబంధించి కణాలు దెబ్బతింటాయి. ఈ క్రమంలో మెదడుకు ఆక్సిజన్, రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీర్ఘకాలంలో ఇది స్ట్రోక్ కు దారితీస్తుంది. దీంతోపాటు మెదడు కుంచించుకుపోయి సైజ్ తగ్గుతుందని.. ఇది ఆ వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని.. అంటున్నారు. కనుక మందు బాబులు మద్యం ఎక్కువగా సేవిస్తుంటే.. వెంటనే ఆ అలవాటును మానుకుంటే మంచిది. లేదంటే అనర్థాలు సంభవిస్తాయి.