అనేక అనారోగ్య సమస్యలకు నిజానికి మన ఇండ్లలోనే అనేక సహజసిద్ధమైన పదార్థాలు ఔషధాలుగా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి గురించి మనకు తెలియదు. అవి కొన్ని అనారోగ్య సమస్యలకు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో చాలా మందికి తెలియదు. అలాంటి పదార్థాల్లో యాలకులు కూడా ఒకటి. చాలా మంది వీటిని వంటల్లో, స్వీట్ల తయారీలో వేస్తారనే అనుకుంటారు. కానీ యాలకులు హైబీపీ సమస్యపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. దీన్ని సైంటిస్టులే నిరూపించారు.
పలువురు సైంటిస్టులు కొందరు వాలంటీర్లకు నిత్యం 1.50 గ్రాముల మోతాదులో యాలకుల పొడిని రెండు సార్లు ఇచ్చారు. రోజూ ఉదయం, సాయంత్రం ఆ మోతాదులో యాలకుల పొడిని వాలంటీర్లు తీసుకున్నారు. 12 వారాల పాటు అలా ఇచ్చాక వారి బీపీని సైంటిస్టులు పరిశీలించారు. దీంతో తేలిందేమిటంటే.. సదరు వాలంటీర్ల సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 19 పాయింట్లు తగ్గిందని, అలాగే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 12 పాయింట్లు తగ్గిందని తేల్చారు. ఈ క్రమంలో 140/90 ఉన్న బీపీ కాస్తా 120/80కి.. అంటే నార్మల్‌కు వచ్చిందన్నమాట. అందువల్ల హైబీపీ సమస్య ఉన్నవారు నిత్యం యాలకుల పొడిని తీసుకుంటే బీపీ అమాంతం తగ్గుతుందని, అది కంట్రోల్‌లో ఉంటుందని తేల్చారు.
ఇక యాలకుల పొడిని తీసుకోవడం వల్ల ఆ వాలంటీర్లలో రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిలు 90 శాతం వరకు పెరిగినట్లు నిర్దారించారు. వీటివల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లకు ఇదే కారణం అవుతుంది. కనుక గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారికే కాదు, ఆ రిస్క్ ఉన్నవారికి కూడా యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. చూశారు కదా.. ఇన్ని రోజులుగా చాలా మందికి ఈ విషయం తెలియదు. మన వంట ఇంట్లో ఉండే యాలకులు ఇంతటి అద్భుతాన్ని చేయగలవన్నమాట..!
పైన తెలిపిన పరిశోధనల తాలూకు వివరాలను సైంటిస్టులు.. ఇండియన్ జర్నల్ ఆఫ్ బయో కెమిస్ట్రీ అండ్ బయో ఫిజిక్స్‌లోనూ ప్రచురించారు.