వక్షోజాలు మహిళల సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలా మంది మహిళలు తమ వక్షోజాలు కోరుకున్న పరిమాణంలో లేవని అసంతృప్తికి లోనవుతుంటారట. ఈ అసంతృప్తి అందరిపై ఒకేతీరు ప్రభావం చూపకపోయినా కొందరిని మానసికంగా కుంగదీస్తుందట. మరి కొందరిలో శారీరక అనారోగ్యాలకు కూడా కారణమవుతుందట. ఇది నిజం. శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రపంచస్థాయి సర్వేలో ఈ విషయం బయటపడింది.
అమెరికాలోని యాంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వీరేన్ స్వామి.. 100 మంది అంతర్జాతీయ నిపుణుల సహకారంతో ‘ది బ్రెస్ట్ సైజ్ సాటిస్‌ఫాక్షన్ సర్వే (బీఎస్‌ఎస్‌ఎస్)’ పేరుతో ఒక సర్వేను నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 18,541 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 48 శాతం మంది మహిళలు తమ వక్షోజాలు ప్రస్తుత పరిమాణం కంటే ఇంకా పెద్దవిగా ఉంటే బాగుండునని అభిప్రాయపడ్డారట. మరో 23 శాతం మంది మహిళలు తమ వక్షోజాలు ప్రస్తుత పరిమాణం కంటే ఇంకా తక్కువగా ఉంటే బాగుండునని అభిప్రాయం వ్యక్తం చేశారట. కేవలం 29 శాతం మంది మహిళలు తమ వక్షోజాల పరిమాణంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారట.
ఈ సర్వేలో తేలిన మరో విషయం ఏందంటే.. బ్రెజిల్, జపాన్, చైనా, ఈజిప్టు, బ్రిటన్ దేశాల్లోని మహిళల్లో చాలామంది తాము కోరుకున్న దానికంటే భిన్నమైన పరిమాణంలో వక్షోజాలు కలిగి ఉన్నారట. ఇక భారత్, పాకిస్థాన్, ఈజిప్టు, లెబనాన్, బ్రిటన్ దేశాల్లోని మహిళలు తమ వక్షోజాలు పెద్దవిగా ఉండాలని కోరుకుంటే, జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ, ఆస్ట్రియా, మలేషియా దేశాలకు చెందిన మహిళలు మాత్రం వక్షోజాల పరిమాణం చిన్నదిగా ఉండాలని కోరుకుంటారట.
అయితే ఈ వక్షోజాల పరిమాణంపై మహిళల అసంతృప్తి వారిని మానసికంగా కుంగదీయడమేగాక, శారీరక అనారోగ్యాలకు కూడా కారణమవుతుందని ప్రొఫెసర్ వీరేన్ స్వామి చెబుతున్నారు. ‘ప్రపంచంలో బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారు తమ వక్షోజాల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోకపోవడమే అందుకు కారణం. వక్షోజాల పరిమాణం విషయంలో అసంతృప్తిగా ఉండే మహిళలు.. వాటిలో మార్పులను పరిశీలించుకోవడంలో కూడా అయిష్టంగా ఉండి, క్యాన్సర్ ముదిరిన తర్వాతగానీ గుర్తించలేకపోతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం’ అని వీరేన్ అన్నారు.
కాకపోతే ఈ వక్షోజాల పరిమాణంపై అసంతృప్తి అనేది వయసు పెరిగినాకొద్దీ తగ్గిపోతుందట. అందుకు లేటు వయసు మహిళల్లో వక్ష సౌందర్యంపై ఆసక్తి సన్నగిల్లడం ఒక కారణమైతే, పిల్లలకు చనుబాలు పట్టి పెంచిన తల్లులు మాత్రం తమ వక్షోజాలు కేవలం అందం కోసం కాదు పిల్లలకు పాలివ్వడానికి అనే మానసిక స్థితికి రావడం రెండో కారణమట.