ప్రపంచ వ్యాప్తంగా శాకాహారం తినేవారు, మాంసాహారం తినేవారు.. రెండు రకాల ఆహార ప్రియులు ఉంటారు. కొందరు తమ విశ్వాసల వల్ల శాకాహారం తింటారు. కానీ కొందరు మాంసాహారం విడిచి పెట్టి శాకాహారం మాత్రమే తినడం ప్రారంభిస్తుంటారు. అయితే మానసిక ఆరోగ్యానికి శాకాహారం తినాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఆయుర్వేదం కూడా దీని గురించి చెబుతోంది.
రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం వల్ల పోషకాలు సరిగ్గా లభిస్తాయి. దీంతో నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మాంసాహారం, శాకాహారం రెండూ ఈ ప్రయోజనాలను మనకు అందిస్తాయి. అయితే మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే శాకాహారమే మంచిదని ఆయుర్వేదం కూడా చెబుతోంది.
ఆయుర్వేదం ప్రకారం శాకాహారాన్ని సాత్విక ఆహారం అంటారు. అంటే మనస్సును ప్రశాంతగా ఉంచుతుందన్నమాట. ఒత్తిడి, ఆందోళన, కంగారు వంటి సమస్యలు ఉన్నవారు మనస్సును కుదురుగా ఉంచుకునేందుకు శాకాహారం తినాలని ఆయుర్వేదం సూచిస్తోంది.
ఇక సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. మాంసాహారం మాని శాకాహారం తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడిందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. శాకాహారం తినడం వల్ల సెల్ఫ్ కంట్రోల్ వస్తుందని, దీంతో పాజిటివ్‌గా ఉంటారని వారు చెబుతున్నారు. అందువల్ల మానసిక సమస్యలతో సతమతం అవుతున్న వారు ఆ సమస్యలు తగ్గేవరకు కొంత కాలం శాకాహారం తింటే మంచిదని సూచిస్తున్నారు.